ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ కార్యాలయాలపై, టీడీపీ నేతలపై వైసీపీ శ్రేణుల దాడి ఘటన పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ఈ దాడులకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన 72 గంటల దీక్షకు జాతీయ స్థాయిలో మద్దతు లభించింది. ఈ నేపథ్యంలోనే సోమవారం నాడు ఢిల్లీలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసేందుకు చంద్రబాబుకు అపాయింట్ మెంట్ ఫిక్సయింది. సోమవారం మధ్యాహ్నం 12:30 గంటలకు రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ తో చంద్రబాబు భేటీ అయి రాష్ట్రంలోని అరాచక పరిస్థితులను వివరించనున్నారు.
ఏపీలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని, కాబట్టి ఆర్టికల్ 356 ప్రయోగించాలని కోవింద్‌కు చంద్రబాబు ఫిర్యాదు చేయనున్నారు. కోవింద్ తో పాటు పలువురు కేంద్ర పెద్దలను చంద్రబాబుతోపాటు పలువురు టీడీపీ నేతలు కలవనున్నారు. రాష్ట్రపతితో భేటీ నేపథ్యంలో టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. చంద్రబాబుతో పాటు ఢిల్లీకి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, యనమల, పయ్యావుల కేశవ్ తదితరులు ఢిల్లీ వెళ్లనున్నట్టు తెలుస్తోంది.
ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాల్సిన ఆవశ్యకతను రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వెల్లడించారు. వ్యవస్థలపై జరుగుతున్న దాడులు, ఆర్థిక పతనంపై రాష్ట్రపతికి నివేదిక అందజేస్తామని కేశవ్ అన్నారు. టీడీపీ నేతలు, కార్యాలయాలపై దాడుల ఘటన వ్యవస్థలపై దాడులకు పరాకాష్ట అని, పోలీస్ వ్యవస్థను కూడా వైసీపీ నేతలు నిర్వీర్యం చేస్తున్నారని కేశవ్ మండిపడ్డారు. పార్టీ కార్యాలయంపై దాడి నేపథ్యంలో అధికారికంగా ఇచ్చిన ఫిర్యాదుపై ఇంతవరకూ ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడమే ఇందుకు నిదర్శనమని కేశవ్ దుయ్యబట్టారు.
కేసు నమోదు చేయడానికి కూడా పోలీసులు భయపడుతున్నారని, టీడీపీ అధికారంలోకి రాగానే కమిషన్ ఏర్పాటు చేసి వైసీపీ హయాంలో జరిగిన అన్ని ఘటనలూ బయటికి తీస్తామని కేశవ్ అన్నారు. మరోవైపు, టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌కు మంగళగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు. కార్యాలయ ఉద్యోగి బద్రి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం విచారణలో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని పోలీసులు కోరారు. పార్టీ కార్యాలయం గోడకు పోలీసులు నోటీసులు అంటించారు.