తొలిసారి పేటీఎం స్టాక్ మార్కెట్ లో లిస్టు అయ్యింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ పేటీఎం లిస్టింగ్ వేళ.. అందరి అంచనాలకు భిన్నంగా లిస్టు అయిన ధరకు భారీగా పోటు పడుతూ నష్టపోయింది. దీంతో.. ఈ షేరులో పెట్టుబడి పెట్టిన వారందరికి భారీ నష్టాలు తప్పలేదు.
రూ.18300 కోట్ల భారీ సమీకరణతో దేశంలోనే అతి పెద్ద ఐపీఓగా రికార్డు క్రియేట్ చేసిన పేటీఎం.. స్టాక్ ఎక్స్ఛేంజీలో అడుగు పెట్టిన తొలిరోజే నష్టాలు తప్పలేదు. ఎందుకిలా? అంటే మార్కెట్ వర్గాలు ఆసక్తికర విశ్లేషణ చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. మార్కెట్ లో ఎంట్రీ ఇచ్చిన రోజే ఎదురుదెబ్బ తగిలినప్పటికి.. పేటీఎం సంస్థ మార్కెట్ విలువ మాత్రం రూ.లక్ష కోట్లకు పైనే నిలవటం విశేషం.
అసలేం జరిగిందంటే..
పేటీఎం మాతృసంస్థ పేరు ‘వన్ 97 కమ్యూనికేషన్స్’. ఈ సంస్థ మొదటిసారి ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) దేశ స్టాక్ మార్కెట్లో గురువారం లిస్టు అయ్యింది. దేశంలో ఇప్పటివరకు వచ్చిన ఐపీఓల్లో ఇదే అతి పెద్దది కావటం గమనార్హం. ఈ ఐపీఓ విలువ రూ.18,300 కోట్లు. డాలర్లలో చెప్పాలంటే 2.5 బిలియన్ డాలర్లు.
ఇంత భారీగా లిస్టు అయిన వేళ పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ భావోద్వేగానికి గురయ్యారు. ‘‘మనలో ఎవరూ ఎప్పుడూ ఊహించని రోజు.. ఇక్కడికి చేరుకుంటామని మనలో చాలామంది నమ్మలేదు.. బోర్డు మెంబర్స్.. షేర్ హోల్డర్స్ దేశంలోనే అదృష్టవంతులు’’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.
2000లో ప్రారంభమైన ఈ సంస్థ 2010లో మొబైల్ రీఛార్జ్ ప్లాట్ ఫామ్ గా ఏర్పాటై.. ఆ తర్వాత పేమెంట్స్.. క్రెడిట్..బీమా.. ఇ కామర్స్ లాంటి సేవల్లో అడుగు పెట్టింది. ఇక.. పేటీఎం ఐపీఓను చూస్తే.. మొత్తం రూ.18,300 కోట్లలో రూ.8300 కోట్లు ఫ్రెష్ ఇష్యూ కాగా.. రూ.10వేల కోట్లు ఆఫర్ ఫర్ సేల్. అంటే.. ప్రస్తుత షేర్ హోల్డర్లు రూ.10వేల కోట్ల వాటాల్ని అమ్ముకుంటున్నారన్న మాట.
వంద మంది ఇన్ స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు రూ.8235 కోట్ల షేర్లను పేటీఎం కేటాయించింది. ఇష్యూ ధరను రూ.2150 నిర్ణయించగా.. మార్కెట్ మాత్రం సానుకూలంగా స్పందించలేదు.
ఇష్యూ ధరకు 9 శాతం తక్కువగా రూ.1955 వద్ద షేరు నమోదైతే.. చివరకు 27.25 శాతం నష్టంతో రూ.1564 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలో 9.3 శాతం తక్కువగా రూ.1950 వద్ద షేరు ట్రేడింగ్ మొదలై.. చివరకు 27.34 శాతం క్షీణతతో రూ.1562 వద్ద స్థిరపడింది. ఇష్యూ ధర వద్ద కంపెనీ మార్కెట్ విలువ రూ.1.39 లక్షల కోట్లు కాగా.. తొలిరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి రూ.1,01,399.72 కోట్లకు పరిమితమైంది.
అంటే.. తొలిరోజు ట్రేడింగ్ పుణ్యమా అని మదుపరులకు చెందిన రూ.38వేల కోట్ల సొమ్ము ఆవిరైంది. పేటీఎం పబ్లిక్ ఇష్యూలో ఒక లాట్ కు 6 షేర్లు నిర్ణయించారు. ఇష్యూ ధర రూ.2150 ప్రకారం ఒక లాట్ పెట్టుబడి పెడితే రూ.12,900 అయ్యింది.. ఈ ప్రకారం మార్కెట్ ముగిసేనాటికి రూ.11,730కు తగ్గింది. అంటే.. ఒక లాట్ పెట్టిన ప్రతి ఒక్కరికి రూ.1170 నష్టం వచ్చింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి అది కాస్తా రూ.3516కు చేరింది. అంటే.. రూపాయి పెట్టుబడి పెడితే ముప్పావలా మాత్రమే మిగిలి.. పావలా అడ్రస్ గల్లంతైంది.
ఎందుకిలా జరిగింది? పేటీఎం నమ్ముకున్నోళ్లకు ఇంత భారీగా దెబ్బ ఎలా తగిలింది? కారణం ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. దీనికి సమాధానాల్ని వెతికితే.. మార్కెట్ వర్గాల నుంచి కొన్ని విశ్లేషణలు బయటకు వచ్చాయి. అందులో ముఖ్యమైనది.. షేరు ధర ఎక్కువగా ఉండటమని చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో షేర్ ఇష్యూ ధర ఎక్కువగా ఉండటంతో సీన్ రివర్సు అయ్యిందంటున్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో లాభాల్ని ఆర్జించటం పేటీఎంకు సవాలు అవుతుందని.. నష్టాలు ఖాయమంటున్నారు. అందుకే.. ఈ షేరు నుంచి బయటకు రావటం ఉత్తమం అన్న సలహా వినిపిస్తోంది. మరి.. ఈ అంచనాలు ఎంతమేర నిజమవుతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొదటిరోజు నమ్మినోళ్లకు దెబ్బేసిన పేటీఎం.. రెండోరోజు ఏం చేస్తుందో చూడాలి.
Investors acting happy after getting #PayTmIPO #Paytm allotment but inside they be nervous af ???????? pic.twitter.com/9i0efiyDUZ
— bae suzy ???? (@SavageAf154) November 16, 2021