సినిమాల్లో హీరోయిన్ కావాలని, సినీ వినీలాకాశంలో తమ రంగుల కలను నెరవేర్చుకోవాలని ఎంతోమంది యువతులు ముంబైలో అడుగుపెడుతుంటారు. బాలీవుడ్ లో తమకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, కొందరికి అదృష్టంతో పాటు అభినయం కూడా ఉండడంతో అవకాశాలు తొందరగానే వస్తాయి. మరికొందరికి రకరకాల కారణాలతో లేటుగా అవకాశాలు వస్తుంటాయి.
అయితే, తమకు సినిమా అవకాశాలు రావడం కోసం, హీరోయిన్ కావడం కోసం చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు క్యాస్టింగ్ కౌచ్ వంటి వాటికి కూడా తలొగ్గుతుంటారని రూమర్స్ ఉన్నాయి. కానీ, సినిమాల్లో అవకాశాల కోసం బాలీవుడ్ నటి పాయల్ రోహత్గీ చేసిన పని మాత్రం మరెవ్వరూ చేసి ఉండరు. తనకు సినిమా అవకాశాలు రావడం కోసం క్షుద్ర విద్యలు, వశీకరణం వంటివి ప్రయోగించానని స్వయంగా పాయల్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
వివాదాస్పద నటి కంగనా రనౌత్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న లాకప్ రియాలిటీ షోలో పాల్గొన్న బాలీవుడ్ నటి పాయల్ రోహాత్గీ షాకింగ్ కామెంట్లు చేసింది. ఆ షోలో భాగంగా ఎలిమినేషన్ ను తప్పించుకోవడానికి ఇప్పటిదాకా ఎవరికీ చెప్పని ఓ రహస్యాన్ని అందరితో పాయల్ పంచుకుంది. ఓ దశలో తనకు సినిమా అవకాశాలు రాకపోవడంతో అనేక క్షుద్రవిద్యలు నేర్చుకున్నానని, అవకాశాలు రావడం కోసం వాటిని ప్రయోగించానని
సంచలన వ్యాఖ్యలు చేసింది.
వశీకరణం, చేతబడి వంటివి కూడా నేర్చకున్నానని, అవకాశాల కోసం వాటిని కూడా ప్రయోగించానని చెప్పడంతో కంగనా సహా ఆ షోలోని కంటెస్టెంట్లదరూ షాకయ్యారు. 15 ఏళ్ల కిందట బాలీవుడ్ కు వచ్చానని, కెరీర్ ఉత్సాహంగానే ప్రారంభమైనా…ఓ దశ తర్వాత ఎవరూ చాన్సులు ఇవ్వలేదని, దీంతో, ఎలాగైనా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలన్న పట్టుదలతో ఢిల్లీలోని ఓ తాంత్రిక పూజారి సాయంతో చేతబడి, వశీకరణ విద్యలు నేర్చుకున్నానని చెప్పింది. ఆ తర్వాత ముంబై వచ్చి అనేకమందిపై వాటిని ప్రయోగించానని, కానీ, క్షుద్రవిద్యల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని త్వరలోనే స్పష్టమైందని చెప్పింది. కొన్ని సినిమా చాన్సులు మామూలుగానే వచ్చాయని పాయల్ పేర్కొంది.