జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర సెకండ్ షెడ్యూల్ను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా విడుదల చేశారు. ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లాలో ఈ యాత్ర విజయవంతంగా సాగింది. గత నెలలో 14వ తేదీన ప్రారంభించిన యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అదేసమయంలో రాజకీయంగా కూడా ఈ యాత్ర సంచలనాలు నమోదు చేసింది. ఈ యాత్ర కొనసాగింపులో భాగంగా తాజాగా సెకండ్ షెడ్యూల్ను విడుదల చేశారు.
ఈ నెల 9(ఆదివారం) నుంచి పవన్ వారాహియాత్ర రెండోదశ ప్రారంభం కానుంది. ఈ యాత్ర మొత్తం 4 రోజుల పాటు జరగనుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ యాత్ర సాగనుంది. జిల్లాలోని ఏలూరు, దెందులూరు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు వారాహి యాత్ర ప్రారంభం అవుతుంది. ఏలూరులో బహిరంగ సభ నిర్వహిస్తారు. 10వ తేదీన జనవాణి కార్యక్రమంలో ప్రజా సమస్యలు తెలుసుకుంటారు. మంగళవారం సాయంత్రం పార్టీ నేతల సమావేశం అవుతారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ యాత్రలో రెండు బహిరంగ సభల్లో పవన్ పాల్గొంటారు.
ఇదీ షెడ్యూల్
09-07-2023(ఆదివారం): సాయంత్రం 5 గంటలకు ఏలూరులో బహిరంగ సభ
10-07-2023(సోమవారం) : మధ్యాహ్నం 12 గంటలకు జనవాణి, సాయంత్రం 6 గంటలకు ఏలూరు నియోజక వర్గం ముఖ్య నాయకులు, వీర మహిళలతో సమావేశం. బహిరంగ సభ లేదు.
11-07-2023(మంగళవారం) : మధ్యాహ్నం 12 గంటలకు దెందులూరు నియోజకవర్గం ముఖ్య నాయకులు, వీర మహిళలతో సమావేశం, సాయంత్రం 5 గంటలకు తాడేపల్లిగూడెం చేరుకుంటారు.
12-07-2023(బుధవారం) : సాయంత్రం 5 గంటలకు తాడేపల్లిగూడెంలో బహిరంగ సభ.