జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమంటూ వైసీపీ నేతలు, కొందరు కాపు నేతలు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. అయితే, ఆ సవాల్ ను స్వీకరించిన పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో పిఠాపురం నుంచి గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. అది కూడా మామూలు ఎమ్మెల్యేగా కాదు…ఉప ముఖ్యమంత్రిగా పవన్ శాసన సభలో తొలిసారి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ ప్రమాణం చేశారు.
కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను… అని పవన్ అనగానే జనసేన, టీడీపీ నేతలు ఈలలు, చప్పట్లు,కేకలతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు. ‘‘శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గానీ, పక్షపాతం గానీ, రాగద్వేషాలుగానీ లేకుండా… రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూర్చుతానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’’ అని పవన్ దైవసాక్షిగా తెలుగులో ప్రమాణం చేశారు.
ప్రమాణం చేసిన తర్వాత ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు గడ్కరీ, జేపీ నడ్డా, రజనీకాంత్, బాలకృష్ణలకు పవన్ నమస్కరించారు. తన సోదరుడు చిరంజీవికి నమస్కరించిన పవన్ కల్యాణ్ ఆ తర్వాత చిరుకు పాదాభివందనం చేశారు. ఈ కార్యక్రమానికి పవన్ భార్య అన్నా లెజినోవా, పవన్ తనయుడు అకీరా, తనయురాలు ఆద్య, చిరంజీవి సతీమణి సురేఖ, హీరో రామ్ చరణ్, మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు, ,సాయి దుర్గా తేజ్, కొణిదెల నిహారిక, శ్రీజ తదితరులు హాజరయ్యారు.