కాకినాడ రూరల్ లో నిర్వహించిన సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగం ఎంతటి రాజకీయ సంచలనంగా మారిందో తెలిసిందే. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై జనసేనాని వ్యక్తిగతంగా టర్గెట్ చేసిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే.. పవన్ తనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడతారన్న సమాచారం ద్వారంపూడికి ముందే తెలుసా? ఆయనకు పవన్ ప్రసంగం తాలుకు అంశాలు ముందే తెలుసా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
ఎందుకంటే.. పవన్ కల్యాణ్ తన ప్రసంగాన్ని మొదలు పెట్టింది ఆదివారం రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాల తర్వాతే. కానీ.. ద్వారంపూడి మాత్రం పవన్ మీద ఫైర్ అయ్యింది? వార్నింగ్ ఇచ్చింది ఆదివారం మధ్యాహ్నమే. సాధారణంగా తమ మీద ఎవరైనా ఆరోపణలు.. విమర్శలు చేసిన తర్వాతే సదరు నేతలు విరుచుకుపడతారు. విమర్శలు చేస్తారు. అందుకు భిన్నంగా పవన్ ప్రసంగానికి దాదాపుగా కొన్ని గంటల ముందే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి జనసేనానికి వార్నింగ్ ఇవ్వటం కనిపిస్తోంది.
కాకినాడ సభకు ముందే ఎమ్మెల్యే ద్వారంపూడి మీద విమర్శలు చేసిన పవన్ కల్యాణ్ మాటలతో ఆయన అలెర్టు అయ్యారంటున్నారు. అయితే.. కాకినాడ సభలో ద్వారంపూడిపై పవన్ ప్రస్తావించిన అంశాలకు.. కొన్ని గంటల ముందే ఆయన మీడియాతో మాట్లాడుతూ ఘాటుగా రియాక్టు కావటం గమనార్హం. పవన్ తనకు ఏ మాత్రం పోటీనే కాదన్న ద్వారంపూడి.. తానేదో అల్లాటప్పాగా.. పవన్ కల్యాణ్ మాదిరి అన్న పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి రాలేదన్నచురకలు వేశారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ జెండాలను భుజాన మోసి.. ఎమ్మెల్యేను అయినట్లు చెప్పారు.
వైసీపీలో చేరిన తర్వాత మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచానన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. ‘రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యా. రెండుచోట్ల ఓడిన పవన్ కల్యాణ్ నాకు పోటీనే కాదు. స్వయం కృషితో రాజకీయాల్లో ఎదిగిన నాకు పవన్ కల్యాణ్ పోటీనే కాదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనను ఎన్నికల్లో నిలబెట్టారు. గెలిచి ఆయన విశ్వాసాన్ని నిలబెట్టా’’ అని వ్యాఖ్యానించారు.
తన మీద లేనిపోని ఆరోపణలు.. లేనిపోని నిందలువేస్తే చూస్తూ ఊరుకుంటానని అనుకోవద్దంటూ పవన్ మీద ద్వారంపూడి ఫైర్ కావటం గమనార్హం. పవన్ ప్రసంగానికి కొన్ని గంటల ముందే జనసేనానికి వార్నింగ్ ఇచ్చిన ద్వారంపూడి.. ‘‘నాపై చేసే ఆరోపణలు.. విమర్శలు నిజమే అయితే వాటిని ఖండించబోను. అకారణంగా.. అనవసరంగా విమర్శలు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోను. ఎట్టి పరిస్థితుల్లో ప్రతీదానికి సమాధానం ఇస్తా. కాకినాడలో పుట్టి పెరిగిన వాడిని.. ఏ విషయంలోనూ కూడా తగ్గేదే లేదు. పవన్ కల్యాణ్ ఎలాంటి ఆరోపణలు చేస్తే వాటిని అంతే తీవ్రతతో తిప్పి కొడతా. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకు తావు లేదు.
అయినప్పటికీ పవన్ కల్యాణ్ నా అంతు తేలుస్తానంటూ విమర్శలు చేస్తున్నాడు. ఇది సమంజసం కాదు’’ అని ద్వారంపైడి వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ఇదంతా చూస్తే..ఆదివారం మధ్యాహాన్నానికే ద్వారంపూడికి రాత్రి వేళలో పవన్ చేసే ప్రసంగం ఏమిటన్న విషయంపై స్పష్టత ఉందా? అన్నదిప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది.