తమ ప్రభుత్వ గొప్పలు చెప్పుకునేందుకు, ఏపీలో పడుతున్న వర్షాలకు తోడు జగన్ ను పొగడ్తలతో ముంచెత్తేందుకు వైసీపీ నేతలు కోట్లు కుమ్మరించి ప్లీనరీ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ప్లీనరీలో జగన్ భజన చేస్తూ…టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ లపై అవాకులు చవాకులు పేలుతూ…జబర్దస్త్ కామెడీ చేస్తున్నారు వైసీపీ నేతలు. ఇక, తమ మానస పుత్రిక వంటి నవరత్నాల గురించి అరిగిపోయిన రికార్డులాగా చెప్పిందే చెప్పి ప్లీనరికి వచ్చిన ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నారు.
ఈ క్రమంలోనే వైసీపీ ప్లీనరీని జనసేన అధినేత పవన్ కల్యాణ్ టార్గెట్ చేశారు. ‘నవ రత్నాలు’పై తనకున్న అనుమానాలు వ్యక్తం చేస్తూ ‘నవ సందేహాలు’ పేరుతో పవన్ తన ట్విటర్ ఖాతాలో చేసిన పోస్ట్ వైరల్ అయింది. ప్రభుత్వ వైఫల్యాలను, నవరత్నాల అమలు తీరును పవన్ గణాంకాలతో సహా ఎండగట్టి జగన్ ను నిలదీశారు. దీంతో, ప్లీనరీ వేళ ఓ పక్క జిల్లాల టూర్ లో ఉన్న చంద్రబాబు, మరో పక్క ట్విటర్ లో పవన్..జగన్ ను ఇరుకున పడేశారు.
ప్రజలను నవరత్నాల పేరుతో జగన్ మభ్యపెడుతున్నారని, రైతు భరోసా, అమ్మ ఒడి, పెన్షన్లు, మద్యపాన నిషేధం, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, పేదలందరికీ ఇళ్లు, ఆసరా పథకాల అమలులో ఎన్నో లోపాలున్నాయని పవన్ ప్రశ్నించారు. రైతు భరోసా పథకం కింద 64 లక్షల మందికి మేలు అని చెప్పి 50 లక్షల మందికే భరోసా ఇవ్వడం, అమ్మ ఒడి 43 లక్షల మందికి ఇచ్చి.. 83 లక్షల మందికి ఇచ్చామని చెప్పడాన్ని పవన్ తప్పుబట్టారు.
పెన్షన్ల లిస్ట్ నుంచి 5 లక్షల మందిని తొలగించారని, సంపూర్ణ మద్యపాన నిషేధం పేరుతో 2018-19లో రూ.14 వేల కోట్లు… 2021-22లో రూ.22 వేల కోట్లు కొల్లగొట్టారని దుయ్యబట్టారు. మద్యంపై వచ్చే ఆదాయం చూపించి రూ.8 వేల కోట్లు బాండ్లు అమ్మిన ఘనత జగన్ దేనని పవన్ మండిపడ్డారు. దాంతోపాటు, సెటైరికల్ కార్టూన్లతో జగన్ ప్రభుత్వంపై పవన్ కొంతకాలంగా చేస్తున్న ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. తాజాగా ముద్దుల మామయ్య కాదు..దొంగ మామయ్య జగన్…మా బడిని ఎత్తుకెళ్తున్నారని పిల్లలు కోపంగా చూస్తున్న కార్టూన్ వైరల్ అయింది.