సమయం.. సందర్భం లేకుండా ఏ ముఖ్యుడి నోటి నుంచి మాటలు రావు. ఒక పార్టీ అధినేతగా.. 2024లో జరిగే ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో అధికారంలోకి ఎవరు రావాలన్న దానిపై డిసైడిండ్ ఫ్యాక్టర్ గా మారారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఆయనకు ఆయన సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. అలానే.. పవన్ లెక్క తేలకుండా ఎవరూ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. మొత్తంగా చూస్తే.. పవనే కేంద్రంగా ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి. ఆయన తీసుకునే నిర్ణయాలు ఏపీ రాజకీయాల్ని.. రాష్ట్ర గమనాన్ని నిర్దేశిస్తుంటాయని చెప్పక తప్పదు.
నోటికి వచ్చినట్లుగా మాట్లాడతారు. అనవసరమైన ఆవేశాన్ని ప్రదర్శిస్తారు. సంబంధం లేని అంశాల్ని ప్రస్తావిస్తుంటారు. తరచూ మాట్లాడే మాటల్లో ఫోకస్ మిస్ అయి.. డైవర్టు అవుతారు. రాజకీయ ప్రసంగాల్లో తరచూ సినిమాల ప్రస్తావన తెస్తారు? ఇలాంటి ఎన్నో విమర్శలు పవన్ ప్రసంగం మీద వినిపిస్తూ ఉంటాయి. అయితే.. గడిచిన కొంతకాలంగా పవన్ తీరులో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. 2019 ఎన్నికల సమయంలో ఆయన ప్రదర్శించిన హావభావాలు.. ఆవేశాల్ని ఆయన తగ్గించుకున్నారు. సెటిల్డ్ గా వ్యవహరిస్తున్నారు.
తొందరపడి మాట్లాడటం లేదు. తనకు ఆభరణం.. ఆయుధమైన హ్యుమన్ టచ్ ను మిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న పవన్.. గతంతో పోలిస్తే సినిమాల ప్రస్తావన బాగా తగ్గించేశారు. అంతేకాదు.. తనను టార్గెట్ చేసే వారు చేసే వ్యాఖ్యలకు సమాధానాలు ఇస్తూనే.. తనను లక్ష్యంగా చేసుకునే వారి మీద కొత్త తరహాగా దాడి చేస్తున్న వైనం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది.
అదే సమయంలో.. మిగిలిన వారిమాదిరి కాకుండా తన మనసుకు అనిపించిన విషయాల్ని సూటిగా చెప్పేందుకు అస్సలు వెనుకాడని తత్త్వం పవన్ లో కనిపిస్తోంది. ఇప్పటం ఎపిసోడ్ తో జగన్ ప్రభుత్వాన్ని అయోమయానికి గురి చేయటంతో పాటు.. ఆత్మరక్షణలో పడేలా చేయటంలో సక్సెస్ అయ్యారు. జాగ్రత్తగా గమనిస్తే ఇప్పటం ఎపిసోడ్ తర్వాత పవన్ మీద వైసీపీ నేతలు మాటలతో మరింతగా దాడి చేస్తున్నారు. ఇప్పటం ఎపిసోడ్ లో తన తీరుపై జరుగుతున్న చర్చకు సమాధానంగా తాజాగా మరోసారి ఆ గ్రామాన్ని సందర్శించి.. నష్టపరిహారం ఇవ్టంతో పాటు.. ఈ సందర్భంగా అమరావతి రైతులకు చురుకు తగిలేలా మాట్లాడారు.
తన చేతిలో అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కష్టాల్లో తోడుగా ఉంటానని.. అండగానిలుస్తానని చెబుతున్న పవన్ కల్యాణ్.. ఇప్పటం గ్రామస్తుల మాదిరి అమరావతి రైతులు తెగువ చూపించి ఉంటే.. అమరావతి కదిలేది కాదంటూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. నిజానికి ఇప్పటివరకు అమరావతి రైతుల మీద ఇంత సూటిగా.. వారికి ఎలా మాట్లాడితే తగులుతుందో అలాంటి మాటను మాట్లాడిన పవన్ కారణంగా అమరావతి రైతుల్లో కొత్త చర్చకు తెర తీసినట్లైందని చెబుతున్నారు.
అమరావతి రైతుల్లో తెగువ లోపించిందన్న మాటను చూసినప్పుడు.. వారేం చేయాలన్న దానికి దిశా నిర్దేశం చేసేలా పవన్ వ్యాఖ్యలు ఉన్నాయంటున్నారు. వైసీపీ నేతలకు మంచి మర్యాద పని చేయవని.. అది పార్టీ కాదని టెర్రరిస్టు సంస్థ అంటూ మండిపడిన ఆయన.. వీధి రౌడీలను ఎలా డీల్ చేయాలో తనకు బాగా తెలుసుని చెప్పుకొచ్చారు. పవన్ మాటలతో అమరావతి రైతుల్లో కదలిక వచ్చే అవకాశం ఉందని.. అదే జరిగితే ఈసారి పోరు మరింత కొత్తగా ఉండే వీలుందన్న మాట వినిపిస్తోంది.