వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ.. ఆ పార్టీ నాయకులకే తలనొప్పి తెచ్చింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాలలో వైసీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ‘విద్యార్థి సాధికారత జగనన్నతోనే సాధ్యం’ అనే నినాదంతో ఆ పార్టీ యువజన నాయకులు ర్యాలీ చేపట్టారు.
అయితే.. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున విద్యార్థులను తరలించాలని భావించారు. దీంతో చుట్టుపక్కల ఉన్న అన్ని కళాశాలల విద్యార్థులను బలవంతంగా తరలించారు. క్లాసులు పోతాయని అన్నా.. వారు వినిపించలేదు. వైసీపీ విద్యార్థి సంఘం నాయకులు పలు కళాశాలలకు వెళ్లి తరగతులు జరుగుతున్న సమయంలో విద్యార్థులను ర్యాలీకి తీసుకొచ్చారు. వారి చేత వైసీపీ జెండాలు పట్టించారు. సీఎం జగన్‌కు జై కొట్టించారు. ఈ ర్యాలీకి సహకరించాలంటూ ఓ విద్యాధికారి కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లకు చెప్పినట్టు ప్రచారం కూడా ఉంది.
అయితే.. ఇంత కష్టపడి విద్యార్థులను తరలించినా.. నాయకులకు సంతృప్తి కలగకపోగా.. తీవ్ర మనో వ్యథ మిగిలింది. ర్యాలీలో పాల్గొన్న కొందరు విద్యార్థులు జగన్‌కు జై కొట్టకుండా.. మెజారిటీ విద్యార్థులు మాత్రం జనసేన జెండాలు పట్టుకుని.. ‘పవన్‌కల్యాణ్ సీఎం కావాలంటూ’ నినాదాలు చేశారు. దీంతో వైసీపీ యువ జన విభాగం నాయకులకు చిర్రెత్తుకొచ్చి.. ఏం చేయాలో తెలియక మధ్యలోనే కార్యక్రమానికి మంగళం పాడారు. ఇక, చదువుకునే పిల్లలతో ఇలా ర్యాలీలు, జై జగన్ నినాదాలు చేయించడమేంటని పలువురు తల్లిదండ్రులు ప్రశ్నించడం కొసమెరుపు.