తెలంగాణలోని కొండగట్టులో జనసేన పార్టీ ప్రచార రథం వారాహికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కొండగట్టులో ప్రత్యేక పూజల అనంతరం వారాహిపైకి పవన్ ఎక్కి అభిమానులు, జనసేన కార్యకర్తలకు అభివాదం చేశారు. కొండగట్టు ఆలయంలో పవన్ ప్రత్యేక పూజలు చేసి పార్టీ అభివృద్ధికి, లోక కల్యాణానికి, కొండగట్టు అంజనేయ స్వామి ఆశీర్వాదం కోరారు. పవన్ ను చూసేందుకు అభిమానులు వందల సంఖ్యలో పోటెత్తారు.
పూజలు ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన జనసేనాని ఏపీలో రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన ప్రస్తుతానికి బీజేపీతో కలిసే ఉందని, ఇంకా తెగదెంపులు చేసుకోలేదని పవన్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, రాబోయే రోజుల్లో ఎవరు కలిసొస్తారో వారితో కలిసి ముందుకెళతామని ప్రకటించారు. ఇక, కొత్త పొత్తులు కుదిరితే కొత్తగా ముందుకెళ్తామని, ఎవరు కలిసొచ్చినా, రాకపోయినా ముందుకెళ్తామని సింగిల్ గా కూడా పోటీ చేస్తామనన అర్థం వచ్చేలా పవన్ మాట్లాడారు.
ఎవరూ కలిసి రాకపోతే ఒంటరిగా ముందుకెళ్తామని క్లారిటీనిచ్చారు. ఇక, ఎన్నికలకు చాలా సమయం ఉందని, వారం రోజుల్లో ఎన్నికలుంటే పొత్తుల గురించి మాట్లాడొచ్చని అన్నారు. ఇక, సీఎం కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ ను స్వాగతిస్తున్నామని అన్నారు. విపక్షాలను అణచివేసేందుకే వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1 తీసుకొచ్చిందని మండిపడ్డారు. అన్ని పార్టీలు కలిసికట్టుగా పోటీ చేయాలన్నదే తన కోరిక అని పవన్ అన్నారు. ఓట్లను చీలనివ్వబోమని, రోజురోజుకు వైసీపీకి గెలుపుపై నమ్మకం సన్నగిల్లుతోందని విమర్శించారు.
ఆ కారణంతోనే తన పర్యటనకు, లోకేష్ పాదయాత్రకు ఆటంకాలను కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 175 సీట్లలో గెలుస్తామని చెప్పుకునే వైసీపీకి అంత భయం ఎందుకని పవన్ ప్రశ్నించారు. తెలంగాణలో కూడా జనసేన కీలక పాత్ర పోషించనుందని, 7-14 సీట్లలో పోటీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని అన్నారు.