మలయాళం హిట్ మూవీ ‘లాసిఫర్’ను తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేయటం తెలిసిందే. ఇందులో హీరో పాత్రధారిని ఎలివేట్ చేసే సీన్లు కుప్పలుగా ఉంటాయి. అన్నింటికి మించి.. మొదట్లో చిరంజీవిని అడ్డుకునేందుకు.. అతను ముఖ్యమంత్రి (తన తండ్రి) భౌతికకాయాన్ని చూసేందుకు.. నివాళులు అర్పించేందుకు బయలుదేరి రావటం.. అతడ్నిఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదంటూ సీఎం కుమార్తె చెప్పటం.. ఆ సందర్భంగా హీరో కారును వదిలేసి.. కాలి నడక రావటంతో పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. దాదాపుగా ఇదే సీన్ ను పవన్ రిపీట్ చేశారు.
ఇంచుమించు ఇలాంటి సీన్ తాజాగా ఏపీ రాజకీయాల్లోచోటు చేసుకుంది. కాకుంటే.. సినిమాలో మాదిరి నివాళులు అర్పించటానికి కాదు కానీ.. తనను అభిమానించటమే శాపంగా మారి.. తమ పార్టీకి చెందిన వారి ఇళ్లను.. ఆస్తుల్ని పగలగొట్టిన అధికారుల తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వ వైఖరిని తప్పు పడుతూ.. ఇప్పటం గ్రామానికి వెళ్లిన పవన్ కల్యాణ్ కు.. సినిమాలో మాదిరి సీన్ ఎదురైంది. ఇప్పటం గ్రామానికి వచ్చేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వస్తున్న విషయాన్ని తెలుసుకున్న అధికారులు.. గ్రామంలోకి రాకుండా ఉండేందుకు వీలుగా.. ఇనుప కంచెల్లి అప్పటికప్పుడు తెప్పించారు. శనివారం ఉదయం హడావుడిగా వేయటం షురూ చేశారు. తనను అభిమానించారన్న కారణంగా ఆస్తుల్ని ధ్వంసం చేసిన అధికారుల తీరును నిరసిస్తూ.. పవన్ కల్యాణ్.. ఇప్పటం గ్రామానికి బయలుదేరారు. ఆయన్ను.. ఆయన కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా కారు దిగిన పవన్ కల్యాణ్.. తననుపోలీసులు అడ్డుకున్న ప్రాంతం నుంచి కాలి నడకన ఇప్పటం గ్రామానికి బయలుదేరారు. అయినప్పటికీ పవన్ ను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా.. పార్టీ నేతలు.. కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. నడిచి వెళ్లటం ఎందుకు తప్పు అవుతుంది? అనివారు ప్రశ్నించారు. దీంతో.. పవన్ ను అడ్డుకునే ధైర్యం చేయలేని పోలీసులు చేష్టలుడిగినట్లు ఉండిపోయారు. కొంతదూరం నడిచిన పవన్.. మరో కారులో ఇప్పటం గ్రామానికి చేరుకున్నారు. ఆస్తులు ధ్వంసమైన వారి వద్దకు వెళ్లిన పవన్ కల్యాణ్.. వారిని ఓదార్చి పరామర్శించారు. వారికి ఎదురైన కష్టం గురించి తెలుసుకుంటున్నారు. దీంతో.. ఇప్పటం గ్రామంలోని వాతావరణం భావోద్వేగంగా మారింది. ఇదంతా చూసిన వారు గాడ్ ఫాదర్ మూవీ సీన్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉందన్న మాట పలువురి నోట వినిపించటం గమనార్హం.
కొట్టుకోండి.. తిట్టుకోండి.. చంపుకోండి.. అరెస్ట్ చేసుకోండి.. – జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు @PawanKalyan#JanaSenaWithIppatam pic.twitter.com/rVAgNdgqZr
— JanaSena Party (@JanaSenaParty) November 5, 2022