ఏపీ సీఎం జగన్పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సెటైర్లతో విరుచుకుపడ్డారు. “జగన్ రెడ్డి గురించి చెప్పాలంటేఏం లేదబ్బా.. పొద్దున్నే మీకు అమ్మ ఒడి-ఆ ఒడి-ఈ ఒడి.. అని డబ్బులిస్తాడు. సాయంత్రం అయ్యాక.. సారా కొట్లో తన వాళ్లను కూర్చోబెట్టి.. అంతకు రెండింతలు గుంజేస్తాడు“ అని వ్యాఖ్యానించా రు. ఈ నాలుగేళ్ల కాలంలో ఇంతకు మించిన పాలన ఎక్కడా ఏమీ చేయలేదని విమర్శించారు.
వైఎస్పైనా చురకలు!
తాను ప్రాణాలకే తెగించి రాజకీయాల్లోకి వచ్చినట్టు పవన్ చెప్పారు. దేనికీ భయపడబోనన్నారు. “ఈ నేల కోసం ఏదైనా మంచి చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చా. ఎవరి బలిదానంతో ఏపీ ఏర్పడిందో.. వారి విగ్రహాలు ఉండవు. కానీ, రాష్ట్రాన్ని దోచుకున్న నేతల విగ్రహాలు మాత్రం కనిపిస్తాయి“ అంటూ.. తొలి సారి వైఎస్ రాజశేఖరరెడ్డిపై పరోక్షంగా పవన్ విమర్శలు గుప్పించారు.
దోపిడీలు, దౌర్జన్యాలు చేసే వాళ్లకే ఇంత ధైర్యం ఉంటే.. రాజ్యాంగ విలువలు, స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని గుండెల్లో నింపుకొన్న తన కెంత ధైర్యం ఉంటుందో ఊహించుకోగలరా? అని పవన్ ప్రశ్నించారు. వైసీపీని రాష్ట్రం నుంచి తరిమికొట్టే వరకు, విశాఖ జిల్లాను వైసీపీ విముక్త జిల్లాగా చేసే వరకు జనసేన నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందని పవన్ తేల్చి చెప్పారు.
“విశాఖలో రుషికొండను ఎలా తవ్వేశారో మనం చూశాం. ఎర్రమట్టి దిబ్బలు తవ్వేసి రియల్ ఎస్టేట్ కోసం వాడుకుంటున్నారు. 10 మంది కలిసి ఇంత దోపిడీ చేస్తున్నారు. విశాఖలో లక్షలాది ప్రజలు ఉన్నారు.. ఎందుకు ఆపలేరు? నేను ఒక్కడినీ ఏమీ చేయలేను. మీరంతా కలిస్తేనే అందరం కలిసి చేయగలం. దేశంలో సహజ వనరులు మనందరివి. జగన్ కోసం, వైసీపీ నాయకుల కోసం అవి ఏర్పడలేదు“ అని పవన్ నిప్పులు చెరిగారు.