ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం పాటించేవారంటే.. నిర్దాక్షిణ్యంగా చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఆయన కోర్టులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సనాతన ధర్మాన్ని దూషించే వారికే అనుకూలంగా కోర్టులు వ్యవహరిస్తున్నాయన్నారు. “చట్టాలు కూడా ఎలా పనిచేస్తాయంటే సనాతన ధర్మం పాటించే వారిపై నిర్దాక్షిణ్యంగా, అన్య ధర్మాలను పాటించే వారిపై మానవత్వం చూపిస్తాయి“ అని అన్నారు.
ఈ సందర్భంగా ఆయన తమిళనాడు ప్రస్తుత డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యలను ఉటంకించారు. సనాతన ధర్మాన్ని ఆయన వైరస్‌తో పోల్చిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు ఉటంకించిన పవన్ కల్యాణ్.. అలాంటి వారిని కోర్టులు కూడా ఏమీ చేయడం లేదన్నారు. ఇదంతా చూస్తే.. అయిన వాళ్లకి(హిందూ ధర్మాన్ని పాటించేవారు) ఆకులు.. కాని వాళ్లకు కంచాలు అన్న దుస్థితి దాపురించిందన్నారు. ఇప్పుడు ఆకులు కూడా లేవని, చేతుల్లో పెట్టి నాక్కోమంటున్నారని తీవ్ర వ్యాఖ్యాలు చేశారు.
ప్రస్తుతం తాను డిప్యూటీ సీఎంగా, జనసేన అధినేతగా ప్రజల మధ్యకు రాలేదన్నారు. కేవలం హైందవ ధర్మాన్ని పాటించే వ్యక్తిగానే సభలో ప్రసంగిస్తున్నట్టు చెప్పారు. “భారతీయుడిగా, హైందవ ధర్మాన్ని పాటించేవాడిగా మీ ముందుకొచ్చా. హిందుత్వాన్ని పాటిస్తా. అన్ని మతాలను గౌరవిస్తా. ఇతర మతాలను గౌరవించేది సనాతన ధర్మం. ఏడుకొండల వాడి ప్రసాదంలో అపచారం జరిగింది“ అని పవన్ తేల్చి చెప్పారు. సనాతన ధర్మంపై దాడి జరిగితే చూస్తూ ఊరుకోనని దానికోసం తన పదవి, జీవితం, రాజకీయం ఇలా ఏది పోయినా బాధపడనని పేర్కొన్నారు.