మచిలీపట్నంలో నిర్వహించిన జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవంలో జగన్ సర్కార్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. జనసేనపై వైసీపీ నేతలు అడ్డగోలుగా మాట్లాడితే వారివి దిక్కులేని బతుకులు అవుతాయని వార్నింగ్ ఇచ్చారు. తమకు టీడీపీ అంటే ఎక్స్ ట్రా ప్రేమేం లేదంటూ పొత్తులపై పవన్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అంటే తనకు ఆరాధ్య భావం లేదని, మాజీ సీఎం, సమర్థుడిగా ఆయనను గౌరవిస్తున్నానని చెప్పారు.
జగన్ కూడా రాజ్యాంగ పదవిలో ఉన్నాడు కాబట్టి, ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతుంటామని వివరించారు. రాబోయే ఎన్నికల్లో పొత్తులపై పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 20 సీట్లకు జనసేనను టీడీపీ పరిమితం చేసిందన్న ప్రచారంపై పవన్ స్పందించారు. చేతులెత్తి మొక్కుతున్నానని, పొత్తుల గురించి తాను ఎక్కడా నిర్ణయం తీసుకోలేదని ఆయన క్లారిటీనిచ్చారు.
వాట్సాప్ మెసేజులను జనసైనికులు నమ్మేస్తే ఎలా? అని ప్రశ్నించారు. దశాబ్ద కాలం మీకు అండగా ఉన్నానని, తనకు ఓటేయకపోయినా పర్లేదని, కానీ, కనీసం తనను నమ్మాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే ఎన్నికల్లో జనసేన ఎట్టి పరిస్థితుల్లోనూ బలిపశువు కాబోదని, ప్రయోగాలు చేయబోమని హామీనిచ్చారు. ఈసారి గెలిచే విధంగానే ప్రణాళిక ఉంటుందని, తనతో సహా బరిలో దిగిన వారంతా గెలిచి తీరాలనే పోటీ చేయబోతున్నామని అన్నారు.
తనతో నడిచేవాడే తన వాడు… తనను శంకించేవాడు తన వాడు కాదని పవన్ అన్నారు. ఈసారి గెలిచిన తర్వాత ఆవిర్భావ దినోత్సవం జరుపుకుందామని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు పవన్. ఈసారి ఎన్నికల్లో ఓటును వృథా కానివ్వబోమని, జనసేన కార్యకర్తలు ఏంజరగాలని కోరుకుంటున్నారో అదే జరుగుతుందన్నార. రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాల్లో జనసేన బలమైన సంతకం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.