విశాఖపట్నంలోని గాజువాకలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభలో వేలాదిమంది జనసైనికులు, పవన్ అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ పై పవన్ సంచలన విమర్శలు చేశారు. జగన్ ఒక క్రిమినల్ అని, రుషికొండపై ఉండటానికి ఆయన ఏమి దేవుడు కాదని పవన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసిపి నేతలు అరిస్తే భయపడనని, తిడితే వెనక్కి వెళ్ళనని, ఒక విప్లవకారుడు రాజకీయ నేతగా మారితే ఎలా ఉంటుందో చూపిస్తానని జగన్ కు వార్నింగ్ ఇచ్చారు.
300 కోట్ల రూపాయల ఆస్తులను కాపాడుకునేందుకు లక్ష కోట్ల విలువైన ప్రజల ఆస్తులను వదిలేసి తెలంగాణ నుంచి ఏపీకి జగన్ వచ్చాడని విమర్శించారు. తాను మంగళగిరి కి షిఫ్ట్ అయిపోయానని, విశాఖను రెండో ఇల్లుగా చేసుకుంటానని పవన్ అన్నారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఒక రౌడీ షీటర్ అని, క్రిస్టియన్ భూములు దోచుకుంటున్నారని, హోదా గురించి, స్టీల్ ప్లాంట్ గురించి లోక్ సభలో మాట్లాడలేదని విమర్శించారు. దారిలో వైఎస్ విగ్రహం చూస్తే మత్స్యకారుడిని కాల్చి చంపిన వ్యక్తి గుర్తుకు వచ్చాడని, వైయస్సార్ హయాంలోనే గంగవరం పోర్టు కట్టారని విమర్శించారు.
ఈ సారి జనసేనకు ఓటేసి ఎంపీలను గెలిపిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటానని అన్నారు. సినిమాల్లో నటించడం ఆపేసేందుకు సిద్ధమని, కానీ తనకు వేరే సంపాదన లేకపోవడంతో పార్టీ నడిపేందుకు సినిమాలు చేయాల్సి వస్తుందని, కొంతమంది విరాళాలు కూడా తన సంపాదనకు తోడుగా పార్టీని నడిపిస్తున్నాయని చెప్పారు. జగన్ ను గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఈ సింహాసనం దిగి పులివెందుల ఎస్టేట్ కి వెళ్ళిపో జగన్ అంటూ పవన్ నిప్పులు చెరిగారు. దోపిడీ చేస్తాడని తెలిసి కూడా జగన్ కు ఓటేశారని, ఒక ఆశయంతో ఇక్కడ పోటీ చేసిన తన ఓడించారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. 2024 లో గాజువాకలో జనసేనకు అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని, ఇక్కడ గెలుపు జనసేనదేనని చెప్పారు.