టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన నేపథ్యంలో ఆ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. చంద్రబాబుకు పూర్తి సంఘీభావం ప్రకటించిన పవన్ కళ్యాణ్ రేపు టిడిపి తలపెట్టిన రాష్ట్రవ్యాప్త బంద్ నకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా జగన్ పై పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మన దేశంలో చట్టాలు సంపూర్ణ స్థాయిలో పనిచేసే ఉంటే జగన్ ముఖ్యమంత్రి అయ్యేవాడా అంటూ పవన్ నిప్పులు చెరిగారు. ఆర్థిక నేరగాడు జగన్ కోర్టు పర్మిషన్ తీసుకొని విదేశాలలో తిరుగుతుంటాడని విమర్శించారు.
వివేకా కేసులో వేళ్లన్నీ ఆ ఇంటి వైపు చూపిస్తున్నా నిందితులకు సులభంగా బెయిల్ వస్తుందని, వారికి చట్టాలు వర్తించవా అన్న అనుమానం కలుగుతుందని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిజికల్ బ్యాటిల్ కావాలని జగన్ కోరుకుంటున్నట్లుగా కనిపిస్తోందని, ఒకవేళ జగన్ యుద్ధమే కోరుకుంటే తాము కూడా రోడ్ల మీదకి వస్తామని పవన్ సవాల్ విసిరారు. చంద్రబాబుని ఎంతో టార్చర్ చేశారని, రేపటి నుంచి తమ సత్తా ఏంటో చూపిస్తామని పవన్ వార్నింగ్ ఇచ్చారు. జగన్ ఒక క్రిమినల్, సైకో పాత్ అని, తాను జైలుకు వెళ్లాను కాబట్టి అందరినీ జైలుకు పంపాలి అన్నదే జగన్ నిర్ణయం అని పవన్ ఆరోపించారు.
జగన్ ఈ రాష్ట్రానికి ఎంతో హానికరం అని, జగన్ ను ఇంటికి పంపిస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని పిలుపునిచ్చారు. జగన్ దోచుకున్న డబ్బులను ఇంగ్లాండ్లో దాచుకుంటున్నారని, ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని పవన్ అన్నారు. తెలంగాణ ప్రజలు జగన్ ను రాళ్లతో తరిమికొట్టారని, ఆంధ్రాలో కూడా అదే పరిస్థితి వస్తుందని జోస్యం చెప్పారు. సైకో జగన్ వైఖరిపై కేంద్రానికి చెబుదామనుకుంటున్నానని, అయితే కొన్నిసార్లు కేంద్రం కూడా ఏమీ చేయాలని పరిస్థితుల్లో ఉంటుందని అన్నారు.