మచిలీపట్నంలో ఈ రోజు జరిగిన జనవాణి కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వంపై పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాడు పెడనలో జరగబోతోన్న బహిరంగ సభలో రాళ్ల దాడికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని పవన్ సంచలన ఆరోపణలు చేశారు. ఆ సభను అడ్డుకొని గందరగోళం సృష్టించేందుకు క్రిమినల్స్‌ను దింపారన్న సమాచారం తనకుందని పవన్ ఆరోపించారు.
ఆ సభలో గొడవలు సృష్టిస్తే సహించబోమని వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ సభలో ఏమన్నా జరిగితే దానికి సీఎం, డీజీపీ, ఇతర అధికారులు బాధ్యత వహించాలన్నారు. టీడీపీ, జనసేన పొత్తును విచ్చిన్నం చేసేందుకు కుట్ర జరుగుతోందని, ఏ తరహా దాడి జరిగినా ప్రభుత్వం, డీజీపీలదే బాధ్యత అని హెచ్చరించారు. జిల్లా ఎస్పీలు, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. పులివెందుల రౌడీయిజం చేస్తే.. చూస్తూ ఊరుకోం అంటూ జగన్ కు వార్నింగ్ ఇచ్చారు.
ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే.. భవిష్యత్ లో దారుణ పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది జగన్…గుర్తు పెట్టుకో అని తీవ్రంగా హెచ్చరించారు. దాడులు చేస్తే ప్రతిదాడికి దిగవద్దని, అనుమానాస్పదంగా, ఆయుధాలతో కనిపించిన వారిని పోలీసులకు అప్పగించాలని జనసైనికులకు పిలుపునిచ్చారు. రెండు, మూడు వేల మంది రౌడీ మూకలు వచ్చే అవకాశం ఉందని, జనసైనికుల సంఖ్యా బలం చాలా ఎక్కువ అని అన్నారు.