మంగళగిరిలోని ఇప్పటం గ్రామంలో జనసేన ఆవిర్భావ సభ నిర్వహించేందుకు స్థలం ఇచ్చారన్న కారణంతో అక్కడి స్థానికులపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రోడ్డు విస్తరణ పేరుతో జనసేనకు మద్దతిచ్చినవారి ఇళ్లను, ప్రహరీ గోడలను అధికారులు కూల్చిన వైనం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటంలో బాధితులను పరామర్శించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించిన సంగతి తెలిసిందే.
అయితే, ఆ పర్యటన సందర్భంగా కూడా పవన్ తో పాటు జనసేన కార్యకర్తలను ఇబ్బంది పెట్టేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. అయినా, సరే పవన్ ఇప్పటంలో పర్యటించి బాధితులకు తాను అండగా ఉంటానని భరోసానిచ్చారు. ఈ నేపథ్యంలోనే అన్నమాట ప్రకారం ఇప్పటంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున జనసేన తరఫున ఆర్థిక సాయం అందజేస్తామని పవన్ ప్రకటించారు.
ఈ నేపథ్యంలోనే ఈ ఆర్థిక సాయం అందించడంపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పందించారు. ఇప్పటం గ్రామంలో వైసీపీ ప్రభుత్వ దాష్టీకానికి ఇళ్లు కోల్పోయిన వారిని జనసేన ఆదుకుంటుందని నాదెండ్ల మనోహర్ చెప్పారు. బాధితులకు తన వంతు అండగా నిలవాలని పవన్ నిర్ణయించారని వెల్లడించారు. ఇందులో భాగంగానే బాధితులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని పవన్ ప్రకటించారని మనోహర్ చెప్పారు. అంతేకాదు, ఈ ఆర్థిక సహాయాన్ని బాధితులకు పవన్ స్వయంగా అందజేస్తారని వెల్లడించారు.