తనను ప్యాకేజీ స్టార్ అంటూ విమర్శిస్తున్న వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చెప్పుతో కొడతా వైసీపీ నాకొడకల్లారా అంటూ పవన్ చేసిన సంచలన వ్యాఖ్యలు జాతీయ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఏపీ, తెలంగాణ జనసేన కార్యకర్తలతో జరిగిన సమావేశం సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన హాట్ కామెంట్స్ వైరల్ గా మారాయి.
తనను వైజాగ్ లో అరెస్ట్ చేస్తారని, తనపై హత్యాయత్నం జరగబోతోందని ప్రొఫెసర్ ఒకాయన కంగారు పడుతూ తనకు చెప్పారని పవన్ అన్నారు. అయితే, తాను ప్రజలకు ఏదో మంచి చేయాలని 14 ఏళ్ల వయసులో అనుున్నానని, తాడో పేడో రాజకీయాలలో ఉంటానని, ప్రజాసేవలో అన్ని రకాల త్యాగాలు చేసేందుకు కూడా సిద్ధపడే రాజకీయాల్లోకి అడుగుపెట్టానని అన్నారు. తాను సినిమాల్లో నటిస్తూనే రాజకీయాలలోనూ చురుకైన పాత్ర పోషిస్తానని, పార్టీని నడపాలంటే తనకు సినిమాల ద్వారా వచ్చే డబ్బే ఆధారమని అన్నారు.
తనకు వైసీపీ నేతల మాదిరిగా సిమెంట్ ఫ్యాక్టరీలు లేవని, అవినీతి చేసి తాను సంపాదించడం లేదని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సంపాదన, సినిమాల గురించి విమర్శించే వైసీపీ నేతలు ఎక్కడ నుంచి సంపాదిస్తున్నారో నిలదీయాలని జనసైనికులకు పవన్ పిలుపునిచ్చారు.
ఇక, తెలంగాణ రాజకీయాలపై కూడా ఫోకస్ చేస్తానని చెప్పిన పవన్…కేసీఆర్ ను కూడా టార్గెట్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి తెలంగాణకూ ముఖ్యమని, లేదంటే శ్రీకాంతాచారి వంటి వ్యక్తుల త్యాగాలు వృథా అవుతాయని పవన్ అన్నారు.
తెలంగాణలో 7 లేదా 14 అసెంబ్లీ సీట్లు, 2 లేదా అంతకంటే ఎక్కువ పార్లమెంటు స్థానాలను ఎంచుకోవాలని…అందులో జనసేన తప్పక పోటీ చేస్తుందని క్యాడర్ కు పవన్ చెప్పారు. తెలంగాణలోని కొండగట్టు నుంచి తన యాత్రను ప్రారంభిస్తానని పవన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో జనసేన జెండా ఎగరేద్దామని పవన్ చెప్పిన మాటలు జన సైనికుల్లో నూతనోత్సాహాన్ని నింపాయి. ఏది ఏమైనా పవన్ కామెంట్స్ ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి.