ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధిస్తూ జగన్ హఠాత్తుగా తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జగన్ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే జగన్ నిర్ణయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. జనసేన మూల సిద్ధాంతాలలో ఒకటైన పర్యావరణ పరిరక్షణపై జగన్ కు ఇప్పటికైనా శ్రద్ధ కలిగినందుకు సంతోషంగా ఉందని పవన్ అన్నారు.
అంతేకాదు, పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తున్న మైనింగ్, ఫార్మా, సిమెంట్, కెమికల్ కంపెనీల నుంచి వెలువడే కాలుష్యాన్ని కూడా నివారించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పవన్ డిమాండ్ చేశారు. అడ్డగోలుగా కాలుష్యాన్ని వెదజల్లుతూ జల వనరులను, పంట పొలాలను, మత్స్య సంపదను నాశనం చేస్తున్న తదితర కంపెనీల వివరాలను కూడా సేకరించాలని, వాటిపై కూడా చర్యలు తీసుకోవాలని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాలుష్యకారక పారిశ్రామిక సంస్థలను ఏర్పాటు చేసే సమయంలో తీసుకోవాల్సిన ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, పోలీసులను పెట్టి ఏక పక్షంగా నిర్వహిస్తోందని, వాటిని కూడా బట్టబయలు చేసే సమయం వచ్చిందని పవన్ అన్నారు. మైనింగ్ చేస్తూ పర్యావరణాన్ని హరిస్తున్న ప్రభుత్వ శాఖల వ్యవహారాలను కూడా వెలుగులోకి తెద్దామని జనసేనాని పిలుపునిచ్చారు. విశాఖలోని రుషికొండ బీచ్ దగ్గర సుప్రీంకోర్టు తీర్పును కూడా పట్టించుకోకుండా కొత్త ప్రాజెక్టును చేపట్టిన జగన్ సర్కారుపై చాలాకాలంగా తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.
పర్యావరణంపై జగన్ ప్రేమ చూపిస్తున్నట్టుగా చేసిన కామెంట్ల నేపథ్యంలో జగన్ ను పవన్ ఇరకాటంలో పెట్టేలా తాజా వ్యాఖ్యలు చేయడం విశేషం. ఏది ఏమైనా ఫ్లెక్సీ బ్యాన్ అంటూ జగన్ సెల్ఫ్ గోల్ వేసుకున్నారని, అందుకే జగన్ ను అదే అంశంతో పవన్ ఇరకాటంలో పడేశారని వాదనలు వినిపిస్తున్నాయి. మరి, పవన్ కామెంట్లపై వైసీపీ నేతల స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.