తూర్పు గోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం కొత్తపాకలలో దివీస్ పరిశ్రమ ఏర్పాటును నిరసిస్తూ స్థానికులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 36 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో దివీస్ బాధితుల నిరసనకు పవన్ మద్ధతు తెలుపుతూ నేడు తూర్పుగోదావరిలో పర్యటించారు. ఈ సందర్భంగా దివీస్ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న మత్స్య కార్మికులకు, ప్రజలకు మద్దతుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ పై పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ భూమి వారసత్వంగా వచ్చిందని, ఈ భూమంతా.. జగన్, వైసీపీ నేతల సొంతామా? అని పవన్ ప్రశ్నించారు. దివీస్ సంస్థకు వ్యతిరేకంగా పోరాడినందుకు అరెస్టయిన 36 మందిని విడుదల చేయాలని పవన్ డిమాండ్ చేశారు. రైతులు ఏమైనా ఆర్థిక నేరాలు చేశారా.. అవినీతికి పాల్పడ్డారా అని జగన్ ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు.
భూమి అందరి సొత్తని, వాటాల కోసం, తమవారి కోసం వేలాది ఎకరాలను పంపకాలను జరపొద్దని పవన్ వార్నింగ్ ఇచ్చారు. తాము దివీస్ కు వ్యతిరేకం కాదని,కానీ, పర్యావరణానికి హాని కలిగించని పరిశ్రమలు రావాలని అన్నారు.తాను దౌర్జన్యం చేయడానికి రాజకీయాల్లోకి రాలేదని పవన్ అన్నారు. తాను వైసీపీ నాయకుల్లా తెలుగు చదువలేదని పరోక్షంగా కొడాలి నానిని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. వందల కోట్ల డబ్బు, వందల ఎకరాల భూములిస్తే బిడ్డల భవిష్యత్ బాగుంటుందా? అని ప్రశ్నించారు. సిద్ధాంతంతోనే అధికారంలోకి వస్తామని, ప్రభుత్వ విధానాలు సరిగా లేకపోతే నిలదీస్తామని చెప్పారు. కాలుష్య జలాలను సముద్రంలోకి కలిపేస్తామంటే కుదరదని, ప్రభుత్వ తీరు మార్చుకోకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.