సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. వైసీపీ అధినేత జగన్ ఘనంగా చెప్పుకుంటున్న ‘నవ రత్నాలు’పై పవన్ స్పందించారు. ఓ పక్క వైసీపీ నేతలంతా నవ రత్నాలు అద్భుతమైన పథకాలంటూ జోరుగా హుషారుగా ప్లీనరీ జరుపుకుంటుంటే…మరో పక్క పవన్ మాత్రం ‘నవ సందేహాలు’ అంటూ అధికార పార్టీ వైఫల్యాలను ఆధారాలతో సహా పవన్ ఎండగట్టారు. నవరత్నాల అమలు తీరుపై నవ సందేహాలను లేవనెత్తిన పవన్…ఈ ప్రకారం ప్రత్యేక పోస్టర్ ను ట్వీట్ చేశారు.
నవరత్నాలను ఘనంగా అమలు చేశామని వైసీపీ పాలకులు ప్రజలను మభ్యపెడుతున్నారని పవన్ విమర్శించారు. రైతు భరోసా, అమ్మ ఒడి, పెన్షన్లు, మద్యపాన నిషేధం, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, పేదలందరికీ ఇళ్లు, ఆసరా పథకాల అమలుపై పవన్ నవ సందేహాలను వ్యక్తం చేశారు. రైతు భరోసా పథకం కింద 64 లక్షల మందికి మేలు అని చెబుతున్న ప్రభుత్వం కేవలం 50 లక్షల మందికే భరోసా ఇవ్వడం నిజం కాదా అని ప్రవ్నించారు.
మూడేళ్లలో 3 వేలమంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, కానీ, 700మందికే ఆర్థిక సాయాన్ని పరిమితం చేశారని పవన్ మండిపడ్డారు. అమ్మ ఒడి 43 లక్షల మందికి ఇచ్చి.. 83 లక్షల మందికి ఇచ్చామని అబద్దపు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు..అర్హులందరికీ పెన్షన్లు అంటూ ఆ జాబితాను నుంచి 5 లక్షల మందిని తొలగించారని ఫైర్ అయ్యారు. సంపూర్ణ మద్యపాన నిషేధం పేరుతో 2018-19లో రూ.14 వేల కోట్లు… 2021-22లో రూ.22 వేల కోట్లు ఆదాయం సంపాదించారని, ఇదేనా మద్య నిషేధం? అని నిలదీశారు. అంతేకాదు, ఆ ఆదాయం చూపించే రూ.8 వేల కోట్లు బాండ్లు అమ్మారని పవన్ మండిపడ్డారు.
ఫీజు రీ ఇంబర్స్ మెంట్ చేయకపోవడం వల్లే విద్యార్థులకు హాల్ టికెట్స్ ఆపేస్తున్నారని, పీజీ విద్యార్థులకు ఫీజు చెల్లింపులు నిలిపివేశారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలందరికీ ఇళ్ళు అంటూ చెరువుల్లో, గుట్టల్లో స్థలాలిచ్చారని పవన్ ఆరోపించారు. ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఎందుకు మంజూరు చేయలేదో చెప్పాలని పవన్ నిలదీశారు. పొదుపు సంఘాల సంఖ్యను ప్రతి ఏటా లక్షల సంఖ్యలో ఎందుకు తగ్గిస్తున్నారని, అభయ హస్తం నిధులు రూ.2 వేల కోట్లు ఎటుపోయాయో చెప్పాలని ప్రశ్నించారు. మరి, పవన్ ప్రశ్నలకు ప్లీనరీ జోష్ లో ఉన్న వైసీపీ నేతలు ఏం సమాధానం చెబుతారో వేచి చూడాలి.
Comments 1