ఏపీలో టెన్త్ పరీక్షా ఫలితాల వ్యవహారం పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. మునుపెన్నడూ లేని విధంగా పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అతి తక్కువ ఉత్తీర్ణతా శాతం రావడంపై వివాదం రేగింది. దీంతో, నాడు-నేడు, ఇంగ్లిష్ మీడియం అని గొప్పలు చెప్పిన జగన్ సర్కార్…పిల్లలకు చదువు చెప్పడంలో విఫలమైందని విమర్శలు వస్తున్నాయి. ఉపాధ్యాయులకు వేరే విధులు అప్పగించడం వల్లే ఇలా జరిగిందని దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు.
ప్రభుత్వ వైఫల్యాలకు విద్యార్థులను ఫెయిల్ చేశారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఫెయిల్ కావడానికి వారి ఇళ్లలో తల్లిదండ్రులే కారణమంటూ నెపం వేస్తారా? అని పవన్ ఫైర్ అయ్యారు. విద్యార్థులకు 10 గ్రేస్ మార్కులు ఇచ్చి వారి భవిష్యత్తును కాపాడాలని పవన్ డిమాండ్ చేశారు. అంతేకాదు, ఉచితంగా రీ కౌంటింగ్, రీవ్యాల్యుయేషన్, నిర్వహించాలని, సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజులు వసూలు చేయకూడదని కోరారు.
అరకొర ఉన్న ఉపాధ్యాయులను మద్యం దుకాణాల దగ్గర క్యూ లైన్లలో నిలబెట్టినందువల్లే విద్యార్థులు ఫెయిల్ అయ్యారని ఆరోపించారు. ఉపాధ్యాయులకు మరుగుదొడ్ల నిర్వహణ, మధ్యాహ్న భోజన పథకం ఫోటోలు తీయడం వంటి పనులు అప్పగించారని, అందుకే విద్యార్థులకు ఈ పరిస్థితి వచ్చిందని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. విద్యార్థుల మానసిక స్థితిని పరిగణనలోకి తీసుకోవాలని, ప్రభుత్వ చేతగానితనాన్ని పిల్లలపై రుద్దవద్దని సీఎం జగన్కు విజ్ఞప్తి చేశారు.