అక్టోబర్ 1 నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర చేపట్టబోతున్న సంగతి తెలిసిందే. టిడిపితో పొత్తు ఉంటుందని పవన్ అధికారికంగా ప్రకటించిన తర్వాత జరుగుతున్న నేపథ్యంలో నాలుగో విడత వారాహి యాత్రకు ప్రాధాన్యత ఏర్పడింది. గతంలో వాలంటీర్ల వ్యవస్థను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని, ఆడపిల్లల అదృశ్యం వెనుక వాలంటీర్ల హస్తం ఉందని పవన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నాలుగో విడత వారాహి యాత్ర ప్రారంభానికి ముందు మరోసారి మహిళల భద్రత గురించి పవన్ సంచలన కామెంట్లు చేశారు.
ఏపీలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు, హత్యాచారాలు పెరిగిపోతున్నా మహిళా కమిషన్ ఎందుకు స్పందించడం లేదని, ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పవన్ ప్రశ్నించారు. మహిళల అదృశ్యంపై స్పందించగానే ప్రభుత్వం హాహాకారాలు చేసిందని, గ్యాంగ్ రేప్ జరిగినా ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. విజయనగరం జిల్లాలో ఇంటర్ విద్యార్థిని గ్యాంగ్ రేప్, హత్య జరిగితే జగన్, హోం మినిస్టర్, మహిళా కమిషన్ ఎందుకు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమానాస్పద మృతి అని కేసు తీవ్రతను పోలీసులు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానం కలుగుతోందని ఆరోపించారు.
దళిత బాలికపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటన కలచి వేసిందని, మైనర్లు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆరోపణలు వస్తున్నాయని, రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతుందని మండిపడ్డారు. మహిళలను వేధించే వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దిశా చట్టం, పోలీస్ స్టేషన్లు ఏర్పాటు వరకే పాలకులు పరిమితం అయ్యారని పవన్ దుయ్యబట్టారు. మహిళల భద్రతపై వైసీపీ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని ప్రజలు గమనించాలని పవన్ కోరారు.