కడప జిల్లాలోని అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆరోపించారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేసిన పవన్.. 200 మంది ప్రాణాలను కాపాడిన లష్కర్ రామయ్యను అభినందించి.. రూ.21 లక్షలు ఆర్థిక సాయం చేశారు. రాయలసీమకు చెడ్డపేరు తెస్తున్న సజ్జల .. ఉగ్రవాద పార్టీకి సలహాదారుగా ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇసుక తోడటం వల్లే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో అన్నమయ్య డ్యామ్ నిర్యాసితులతో పవన్‌కల్యాణ్ సమావేశమయ్యారు. ఆరోజు లష్కర్ రామయ్య లేకపోతే మరింత ప్రాణనష్టం జరిగేదని అన్నారు. విపత్తు నిర్వహణ సంస్థ చేయాల్సిన పనిని రామయ్య చేశారని కొనియాడారు. ఆయనను ఈ సందర్భంగా అభినందించారు. ప్రమాదం వల్ల తండ్రిని కోల్పోయిన బాక్సర్ వంశీకృష్ణకు రూ.50 వేలు ఆర్థిక సాయం చేశారు.
జాతీయస్థాయి క్రీడాకారుడు నష్టపోతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వంశీకృష్ణ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేందుకు ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఉగ్రవాద పార్టీకి సలహాదారుగా ఉన్నారని పవన్‌కల్యాణ్ ఆరోపించారు. సజ్జల రాయలసీమకు చెడ్డపేరు తెస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ బాధ్యతారాహిత్యం వల్లే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిందని.. చెట్లు నరికేవాళ్లు గరుడ పురాణం చదవాలన్నారు. డ్యామ్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉండాలని పవన్ డిమాండ్ చేశారు.