ప్రజల తరఫున ప్రభుత్వాలను ప్రశ్నించేందుకే తాను జనసేన పార్టీని స్థాపించానని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చాలా సందర్భాల్లో చెప్పారు. అయితే, ఏపీలో జగన్ ప్రభుత్వంపై సందర్భానుసారంగా విమర్శలు గుప్పిస్తోన్న పవన్ కల్యాణ్…తెలంగాణలో మాత్రం పార్టీ కాడి వదిలేశారని టాక్ ఉంది. ఆ టాక్ కు తగ్గట్లుగానే పవన్ గతంలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
తెెలంగాణలో పార్టీ నిర్మాణం చాలా కష్టమని, తాను పగటికలలు కనే వ్యక్తిని కాదని ,పార్టీని బలోపేతం చేసేందుకు తన దగ్గర డబ్బు, బలం లేదని పవన్ స్వయంగా ప్రకటించడంతో తెలంగాణలో జనసేన కేడర్ డీలా పడ్డారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి తెలంగాణ రాజకీయాలపై పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు తనను పిలిచే వరకు ఇక్కడకు రానని, రాజకీయాల్లో నిలదొక్కుకోవడం కష్టమని పవన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి.
తెలంగాణ సమస్యలపై పోరాడే వారిని అసెంబ్లీకి పంపేందుకు కృషి చేస్తానని పవన్ చెప్పడం చర్చనీయాంశమైంది. తెలంగాణ భాషను, యాసను తాను గౌరవిస్తున్నానని చెప్పారు. తలకాయ ఎగిరిపోతుందా.. ఓడిపోతామా.. గెలుస్తామా అని ఆలోచించలేదని, ఏపీలో వైసీపీ నాయకులు తనకు శత్రువులు కాదని, వారి వల్ల ఏర్పడిన ప్రజా సమస్యలు మాత్రమే శత్రువులని పవన్ అన్నారు.
కులం, మతం, రంగు, ప్రాంతం మనకు తెలియకుండా జరిగిపోతాయని, కులాలను రెచ్చగొట్టడం తన ఉద్దేశం కాదని పవన్ అన్నారు. కులాల కొట్లాటతో ఏపీ అభివృద్ధి దిగజారిపోయిందన్నారు. ఏ మతంపై దాడి జరిగినా ఖండిస్తానని పవన్‌కల్యాణ్ ప్రకటించా. దౌర్జన్యం, అవినీతి, పేదరికమే జనసేనకు బద్ద శత్రువులని పవన్ అన్నారు. ఆంధ్ర పాలకులను తెలంగాణ నాయకులు బద్దశత్రువులుగా చూశారని విమర్శించారు.
పవన్ తాజా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. తెలంగాణలో జనసేన పని అయిపోయినట్లేనని, వేరే పార్టీల వారికి మద్దతివ్వడం తప్ప జనసేన సొంతంగా పోటీ చేసే పరిస్థితి లేకే పవన్ ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. జగన్ పై ఏపీలో విరుచుకుపడే పవన్…కేసీఆర్ ను పల్లెత్తు మాట కూడా అనడం లేదని ట్రోల్ చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు పిలిచే వరకు రానని పవన్ అనడం, జనంపై పవన్ అలగడం ఏమిటని సెటైర్లు వేస్తున్నారు. ఏపీ రాజకీయాల్లోకి రావాలని పవన్ ను ప్రజలు పిలవలేదని అంటున్నారు. తెలంగాణ పాలిటిక్స్ కు పవన్ గుడ్ బై చెప్పినట్లేనంటూ కామెంట్లు చేస్తున్నారు.