టీడీపీ అధినేత చంద్రబాబుకు పొత్తులపై ఓ క్లారిటీ వచ్చాక టీడీపీతో జనసేన పొత్తులపై మాట్లాడతానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు రాజకీయ కాక రేపుతున్నాయి. ఏపీలో పొత్తులపై చర్చలు జరుగుతున్న సమయంలో పవన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. తాను సీఎం అభ్యర్థి అని బీజేపీ చెప్పలేదని, బీజేపీతో జనసేన పొత్తు చెడిపోవాలని చాలా మంది కోరుకుంటున్నారని అన్నారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం 2014, 2019లో తాను తగ్గానని, కానీ 2024లో తగ్గటానికి సిద్ధంగా లేనని పవన్ స్పష్టం చేశారు. ఈ సారి మిగతా వాళ్లు తగ్గితే బాగుంటుందంటూ టీడీపీని, చంద్రబాబును ఉద్దేశించి అన్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తాను ఓడిపోయినా ఆగలేదని..పదవి ఉంటే ఇంకా జనానికి ఎక్కువ సేవ చేస్తానని సీఎం పదవిపై మక్కువను పవన్ కల్యాణ్ వెళ్లగక్కడం ఇపుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలుని, కానీ,ఇకపై తగ్గేది లేదని కూడా డిసైడ్ అయిపోయామని పవన్ స్పష్టం చేశారు. అయితే, పవన్ జోష్ ఎప్పటి లానే కొన్ని రోజుల తర్వాత దిగిపోతుందా, లేక 2024 అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగుతుందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే, పవన్ ఇచ్చిన స్టేట్ మెంట్ పై టీడీపీ రియాక్షన్ ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. అయితే, ఇప్పటికే నిస్తేజంతో ఉన్న కేడర్ లో జోష్ నింపేందుకు పవన్ ఈ టైప్ స్టేట్ మెంట్ లు ఇస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.