జగన్ పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కు పోయిందని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, ఆ రోడ్లపై ప్రయాణిస్తే నరకానికి డైరెక్ట్ గా టికెట్ తీసుకున్నట్లేనని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇక, వర్షాకాలంలో అయితే, ఏపీలో రోడ్లు చెరువులు, తటాాకాలను తలపిస్తుంటాయని కామెంట్లు చేస్తుంటారు. ఇక, రోడ్ల దుస్థితిపై అయితే జనసేనాని పవన్ కల్యాణ్ గతంలో కూడా పదునైన విమర్శలు చేశారు. కొత్త రోడ్లు వేయాలంటూ ప్రభుత్వాన్ని పవన్ కోరినా..పట్టించుకోలేదు.
ఈ క్రమంలోనే తాజాగా కురుస్తున్న వర్షాల కారణంగా మరింత అధ్వాన్నంగా తయారైన రోడ్ల గురించి పవన్ మరోసారి స్పందించారు. ఈ నేపథ్యంలోనే జగన్ పై పవన్ సోషల్ మీడియాలో సెటైరికల్ కార్టూన్ లతో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఎప్పుడూ హెలికాప్టర్లలో తిరిగే జగన్ కు రోడ్ల దుస్థితి గురించి తెలియదన్న అర్థం వచ్చేలా ఈ కార్టూన్ ను వేశారు. ఆ కార్టూన్ ను పవన్ షేర్ చేయడంతో అది వైరల్ అయింది. మరోవైపు, జగన్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదనే అంశంపై కూడా ఓ కార్టూన్ ను పవన్ ట్విటర్ లో పోస్ట్ చేశారు. ‘
డిగ్రీ, పీజీ కూడా చేశాను. ఏదైనా జాబు ఇమ్మంటే… ఇది ఇచ్చి వెళ్లిపోయాడు’ అంటూ ఒక నిరుద్యోగి తన చేతిలోని జాబ్ క్యాలెండర్ను చూపిస్తున్నట్లుగా ఆ కార్టూన్ లో ఉంది. పట్టభద్రుడు పకోడీలు, పండ్లు అమ్ముకుంటున్నట్లు ఉండడం ఆ కార్టూన్ కే హైలైట్. కొద్ది రోజులుగా జగన్ పై పవన్ వరుస కార్టూన్లతో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.