రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఏపీలో పొలిటికల్ హీట్ పెంచిన ఈ ఘటన నేపథ్యంలో వైసీపీ సర్కార్ పై విపక్షాలు విరుచుకుపడ్డాయి. దీంతోపాటు, టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుల రామతీర్థ యాత్ర నేపథ్యంలో ఉద్రిక్తత ఏర్పడడం కలకలం రేపింది. బీజేపీకి మిత్రపక్షమైన జనసేన కూడా ఈ ఘటనపై మండిపడింది. ఈ క్రమంలోనే ఆలయాలపై దాడుల ఘటనలపై జగన్ సర్కార్ ఉదాసీన వైఖరిని జనసేన అధినేత పవన్ ఎండగడుతున్నారు. జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించడంలో బీజేపీ, జనసేనలు పోటీపడుతున్నాయి. ఇంకా చెప్పాలంటే బీజేపీ నేతలకంటే పవన్ ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా బీజేపీకి పవన్ దూకుడుగా మరో అడుగు వేశారు.
ఆ ఘటన నేపథ్యంలో రామతీర్థ పోరాట కమిటీని పవన్ ఏర్పాటు చేశారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శివశంకర్ నేతృత్వంలోని ఈ కమిటీలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు పాలవలస యశస్విని, ఉత్తరాంధ్ర ప్రాంతీయ కమిటీ సభ్యులు గడసాల అప్పారావు, డాక్టర్ బొడ్డిపల్లి రఘులను పవన్ నియమించారు. ఘటన జరిగి ఇన్ని రోజులవుతున్నప్పటికీ… ఈ కేసులో పురోగతి లేదని జనసేన విమర్శించింది. ఈ కేసులో పోలీసులకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వలేదని అనుమానించాల్సిన పరిస్థితులున్నాయని అభిప్రాయపడింది. సోము వీర్రాజు బృందంతో కలిసి ఈ కమిటీ పని చేస్తుందని పవన్ చెప్పారు. జనసేన కార్యకర్తలను బీజేపీతో సమన్వయం చేసుకుంటూ ఈ కమిటీ పని చేస్తుందని తెలిపింది. పవన్ దూకుడు చూస్తుంటే బీజేపీకి మంటపెడుతున్నట్టు కనిపిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ పై విమర్శలు గుప్పించడంలో సోము కంటే పవన్ ముందుంటున్నారన్న టాక్ వస్తోంది. పవన్ స్పీడ్ ను అందుకునేందుకు బీజేపీ నేతలు కూడా రెడీ కావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.