ఈ నెల 12న ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రోజు రాత్రి చంద్రబాబు మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కబోతోంది అన్న విషయంపై దాదాపుగా ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది. మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా జనసేన శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో జనసేన ఎల్పీ నేతగా పవన్ కల్యాణ్ పేరును తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించగా ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదించారు.
మరోవైపు, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా భేటీ అయ్యారు. బీజేపీ.శాసనసభాపక్ష నేత ఎంపికపై బీజేపీ ఎమ్మెల్యేలతో బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి చర్చించారు. అధిష్ఠానం ప్రకటనకు ఎమ్మెల్యేలంతా కట్టుబడి ఉండాలని నిర్ణయించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై ప్రజలు విశ్వాసం ఉంచి మంచి విజయం అందించారని పురందేశ్వరి అన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్నారని, రాష్ట్ర బీజేపీ తరఫున ఈ కార్యక్రమంలో పాల్గొంటామని పేర్కొన్నారు.