బ్రో వివాదంపై జరుగుతున్న పంచాయతీలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొలిసారి స్పందించారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో జనసేన నేతలు, కార్యకర్తలతో మాట్లాడిన పవన్…ఈ సందర్భంగా జనసైనికులకు పలు విషయాల్లో దిశా నిర్దేశం చేశారు. రాజకీయాలు వేరు, సినిమా వేరని, సినిమాను రాజకీయాల్లోకి తీసుకురావద్దని జనసైనికులకు పవన్ విజ్ఞప్తి చేశారు. తన సినిమా విషయంలో అభిమానులు స్పందించడం వేరే, జనసైనికులు స్పందించడం వేరని చెప్పారు.
జనసేన సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధులు సినిమా డిబేట్లోకి వెళ్లకూడదని సూచించారు. డిబేట్ లో వైసీపీ నేతలస్థాయికి దిగజారవద్దని కోరారు. సినిమానే ఇంధనమని, తన రాజకీయాలను అదే నడిపిస్తోందని అన్నారు. ముందస్తు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోరాడేందుకు జనసేన నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. విలువలతో రాజకీయాలు చేసే పరిస్థితి నేడు ఏపీలో లేదని అన్నారు. కానీ, డబ్బు తీసుకుని సీట్లు ఇచ్చే సంస్కృతి జనసేనలో లేదని చెప్పారు. డబ్బుతో ఓట్లు కొనొద్దని, కానీ, ఎన్నికలలో పోటీకి డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుందని చెప్పారు.
ఈ భావజాలంతో ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలను కూడా ఆహ్వానిస్తానని అన్నారు. తెలంగాణకు ఏపీ అభివృద్ధి అవసరం అని, అది జరిగితేనే తెలంగాణకు వలసలు ఆగుతాయని చెప్పారు. 2 దశాబ్ధాల శ్రమ, కృషిని ఏపీకి పెట్టుబడిగా పెట్టానని పవన్ అన్నారు. అందుకే తాను ఏపీ అభివృద్ధిపై దృష్టి సారించానని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాక్షస పాలన నుండి రాష్ట్రాన్ని బయట పడేయాలని పిలుపునిచ్చారు. ఈ పాలనపై మనం ఎలుగెత్తకుంటే ఏపీని మరిచిపోవాల్సిందేనని అన్నారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే త్యాగం తప్పదని, తాను త్యాగం చేస్తానని, జనసైనికులు అండగా ఉండాలని కోరారు.