ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు ఎంత హోరాహోరీగా సాగుతున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న ఏపీలో మండుతున్న ఎండలతో రాజకీయ మంటలు పోటీ పడుతున్నాయి. రాజకీయ వైరం వ్యక్తిగత స్థాయికి చేరుకోవటంతో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ కోవలోకే వస్తుంది తాజాగా గుంటూరు జిల్లాలోని పొన్నూరులో చోటు చేసుకున్న ఉదంతం.పొన్నూరు పట్టణానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వస్తున్నారు.
షెడ్యూల్ ప్రకారం ఈ రోజు (ఆదివారం) ఉదయం ఆయన ఒక బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఇందుకోసం అవసరమైన అనుమతుల్ని తీసుకున్నారు. పవన్ ప్రయాణించే హెలికాఫ్టర్ ల్యాండ్ అయ్యేందుకు వీలుగా ఒక హెలిప్యాడ్ ను ఎంపిక చేశారు. ఈ హెలిప్యాడ్ ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసింది.
పొన్నూరులోని సజ్జా ఫంక్షన్ హాల్ వద్ద హెలిప్యాడ్ ను సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి కోసం సిద్ధం చేసిన హెలిప్యాడ్ ఖాళీగా ఉండటంతో పవన్ కల్యాణ్ హెలికాఫ్టర్ ను సైతం అక్కడే ల్యాండ్ చేయాలని అధికారులు భావించారు. అయితే.. అనూహ్యంగా రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ను జేసీబీ సాయంతో తవ్వేసిన వైనాన్ని గుర్తించారు. ఇదంతా వైసీపీకి చెందిన నేతలే ఇలా చేసి ఉంటారని భావిస్తున్నారు.
ముఖ్యమంత్రి కోసం ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ను ఎలా వాడుకుంటారని కొందరు వైసీపీ నేతలు వాదనలు వినిపించటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. బిన్నమైన రాజకీయ పంధా ఉండొచ్చు. అంతమాత్రానా… ఒకరు వినియోగించింది మరొకరు వినియోగించకూడదన్నట్లుగా వ్యవహరించటం.. తమకు ప్రత్యర్థులైన వారికి ఉపయోగపడకూదన్న రీతిలో ధ్వంసం చేయటం మంచి సంస్క్రతి కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే.. పవన్ కల్యాణ్ ప్రయాణించే హెలికాఫ్టర్ ను ల్యాండ్ చేసేందుకు అవసరమైన హెలిప్యాడ్ కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.