జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు మహూర్తం ఖరారైంది. అక్టోబరు 5న విజయదశమి రోజున తిరుపతి నుంచి పర్యటన ప్రారంభించి వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు పవన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. దసరా రోజున ప్రారంభించి ఆరు నెలల్లో రాష్ట్రమంతా పర్యటించడం, ప్రతి ఉమ్మడి జిల్లాలోనూ బహిరంగసభలు నిర్వహించనున్నట్టు జనసేన నేతలు పేర్కొన్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటనలు ఉండేలా రూట్‌మ్యాప్ రూపొందిస్తున్నారు.
వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌లోనే ఎన్నికలు ఉంటాయనే సంకేతాలు వస్తున్నందున రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు పెద్దగా సమయం లేదని, ఇప్పటినుంచే నాయకులు సన్నద్ధం కావాలనేది పవన్ అభిప్రాయం. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే పిలుపునిచ్చారు.
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో యాత్ర చేపట్టనున్నట్లు పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. అక్టోబర్‌లో తిరుపతి నుంచి ఈ యాత్ర ప్రారంభం అవుతుందన్నారు. జగన్ పాలనలో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, ప్రణాళిక లేని పాలన వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు.
జగన్ వర్క్ ఫ్రం హోం సీఎం అని, ప్రభుత్వాన్ని నడపడం చేతకాకే చేతులు ఎత్తేశాడని విమర్శించారు. అందుకే వచ్చే మార్చిలో జగన్ ఎన్నికలకు వెళతాడని, దీనిపై తమ వద్ద పక్కా సమాచారం ఉందన్నారు. నిజాయితీకి నిదర్శనంగా ఉండే పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమని పేర్కొన్నారు.