ఏపీలో టీడీపీ-జనసేన మధ్య పొత్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ రెండు పార్టీలకు తోడుగా బీజేపీ కూడా కలిసి వస్తే వైసీపీ ఓటమి ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా భావిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఢిల్లీలో కేంద్ర మంత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. మూడు పార్టీలు పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లే విషయంపై అమిత్ షా తో చంద్రబాబు చర్చించారు. చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత అమిత్ షా పలు కీలక వ్యాఖ్యలు కూడా చేశారు.
ఏపీలో బీజేపీ పొత్తులపై త్వరలోనే నిర్ణయం ఉంటుందని షా వ్యాఖ్యానించారు. ఎన్డీఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారంటూ టీడీపీని ఉద్దేశించి షా పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రాజకీయంగా ఎంత పెద్ద కూటమి ఉంటే అంత మంచిదని భావిస్తున్నామని టిడిపిని ఎన్డీఏలోకి ఆహ్వానించేందుకు పరోక్షంగా షా సంకేతాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 14న ఢిల్లీలో పర్యటించబోతున్నారు. టీడీపీతో పొత్తు, సీట్ల పంపకాలు వంటి అంశాలపై బీజేపీ పెద్దలతో పవన్ చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక, రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లోని పరిణమాలపై ఎలా వ్యవహరించాలి అన్న విషయంపై కూడా బిజెపి హై కమాండ్ తో పవన్ చర్చించబోతున్నారని తెలుస్తోంది. ఢిల్లీలో పవన్..‘త్రికూటమి’ పొత్తు ఫైనల్ చేయబోతున్నారని తెలుస్తోంది.
ఇక, ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఉభయగోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారని తెలుస్తోంది. 4 రోజులపాటు అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలో జరిగే సమావేశాలకు పవన్ హాజరు కాబోతున్నారని తెలుస్తోంది. జనసేన పార్టీ కీలక నేతలు, స్థానిక నేతలు ప్రముఖులతో పవన్ భేటీ కాబోతున్నారని తెలుస్తోంది. ఆ సమావేశంలో టీడీపీ నేతలతో కూడా పవన్ చర్చలు జరిపే అవకాశం ఉందని తెలుస్తుంది. నియోజకవర్గ స్థాయిలో టీడీపీ-జనసేన నేతల మధ్య సుహృద్భావ వాతావరణ ఏర్పాటు చేసి పొత్తులు ఫలప్రదం చేయడం లక్ష్యంగా పవన్ సమావేశాలు నిర్వహించబోతున్నారట.