ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడిపై జనసేన అధినేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన నిప్పులు చెరిగారు. సీఎం జగన్ పై జరిగిన రాళ్ల దాడిపై అనుమానాలు వ్యక్తం చేసిన ఆయన.. ‘ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గాయమైతే రాష్ట్రానికే గాయమైనట్లుగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు’ అంటూ వ్యాఖ్యానించటం షాకింగ్ గా మారింది. తెనాలిలో నిర్వహించిన బహిరంగ సభలో సంచలన వాదనను వినిపించిన పవన్ కల్యాణ్.. తన వాదనకు జస్టిఫికేషన్ ఇచ్చే క్రమంలో పలు అంశాల్ని ప్రస్తావించారు.
– బాపట్ల జిల్లాలో 15 ఏళ్ల బాలుడు అమరనాథ్ గౌడ్ తన అక్కను వేధించొద్దన్నందుకు వైసీపీ కార్యకర్త నిర్దాక్షిణ్యంగా పెట్రోల్ పోసి తగలబెడితే అప్పుడు రాష్ట్రానికి గాయం కాలేదా?
– చంద్రబాబుపై రాళ్ల వర్షం కురిపిస్తే రాష్ట్రానికి గాయం కాలేదా?
– ఏపీలో 30 వేల మంది ఆడబిడ్డలు కనిపించకుండా పోతే గాయం కాలేదా?
– మీ చుట్టూ భద్రత ఉంది. ఆ పై జెండాలున్నాయి. అంత భద్రత ఉన్న సీఎంపై రాయి వేయటమా?
– మీరే దాడులు చేస్తారు. మీపై దాడులా?
– రాష్ట్ర డీజీపీ.. నిగా విభాగం ఏం చేస్తున్నట్లు?
– చేతిలో అధికార యంత్రాంగం ఉంది. ఇప్పటివరకు ఈ వ్యవహారానికి కారకులెవరో ఎందుకు గుర్తించలేకపోయారు?
– గతంలో ప్రజారాజ్యం తరఫున ఖమ్మం పర్యటనకు వెళ్లినప్పుడు నా మీద రాళ్లు పడ్డాయి. అప్పుడు సీఎంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. అప్పుడు చెప్పుకోవటానికి నా దగ్గర మీడియా కూడా లేదు. నేనేమీ ముఖ్యమంత్రి కొడుకును కాదు కదా? అందుకే నా మీద కనీసం రాళ్లు వేసినట్లుగా కూడా బయటకు తెలియలేదు.
– జగన్ చుట్టూ భారీగా భద్రత ఉంది. వారు తలుచుకుంటే రాయి వేసినోడిని నిమిషాల్లో పట్టుకోవాలి కదా? ఎందుకు పట్టుకోలేదు? అయినా అందరి మీద దాడి చేసిన వ్యక్తిపై ఎవరైనా దాడి చేయడానికి సాహసిస్తారా? వైసీపీ నాయకులే రాళ్లతో దాడి చేయించారేమో?
– జగన్ పై జరిగిన దాడి గురించి స్పందించాలని మా నాయకులు అడిగారు.కానీ..నిజంగానే దాడి జరిగిందా? ఆయనే చేసుకున్నారా? లేక కోడికత్తిలా డ్రామానా నాకు తెలియటం లేదు. కరెంట్ ఎందుకు తీసేశారో అర్థం కాలేదు. అందుకే స్పందించలేదు.
దాడిపై పలు ప్రశ్నలు సంధించిన పవన్.. దాడి ఘటనపై తాను ఎందుకు స్పందించలేదో క్లారిటీ ఇచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఏదో ఒకటి జరుగుతుందన్న పవన్.. ‘‘అదేం విచిత్రమో.. ఎన్నికలు రాగానే వైఎస్ జగన్ కు ఏదోలా గాయమవుతుంది. లేదంటే ఎవరో ఒకరు చనిపోతారు. చంపేస్తారు. పోయినసారి ఎంతో భద్రత ఉండే విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో గాయం చేశారట. తాజాగా గులకరాయితో దాడి. నాన్న పులి వచ్చే.. కథలా ఎన్నిసార్లు నమ్మాలి? నమ్మకం పోయింది. ఈ డ్రామాలు ఆపాలి’’ అని మండిపడ్డారు.
జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన పవన్ కల్యాణ్.. దారుణ హత్యకు గురైన వైఎస్ వివేకా గురించి.. ఆయన హత్యపై గళం విప్పిన జగన్ ఇద్దరు సోదరీమణుల గురించి ప్రస్తావించటం గమనార్హం. ‘‘మాజీ మంత్రి వివేకానందరెడ్డిని గొడ్డలితో నరికి చంపేస్తే గుండెపోటు అని చెప్పారు. వివేకా కుమార్తె డాక్టర్ సునీత.. వైఎస్ కుమార్తె షర్మిల న్యాయం చేయాలని కోరితే వారిని కించపరుస్తున్న వ్యక్తి జగన్’’ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ప్రజలు మధ్యతరగతి మనస్తత్వాన్ని వీడాలన్న పవన్.. ‘‘కొడవగంటి కుటుంబరావు చెప్పినట్లు.. అధికారం.. డబ్బు ఉన్న వాడు ఏం చేసినా మధ్యతరగతి వ్యక్తులుగా దానికో నైతిక భాష్యం మనకు మనం చెప్పుకుంటాం. కాకినాడలో ఉన్న మాఫియా డాన్ ఎవరినైనా కత్తితో పొడిస్తే ‘పాపం ఏ పరిస్థితుల్లో కత్తితో పొడిచాడో అంటాం. వివేకానందరెడ్డిని గొడ్డలితో నరికేస్తే ఏ పరిస్థితుల్లో చేయాల్సి వచ్చిందో పాపం అంటాం. నిన్న జగన్ గారికి దెబ్బ తగిలితే మా పార్టీ నేతలు నా దగ్గరకు వచ్చి ఆయన త్వరగా కోలుకోవాలని స్టేట్ మెంట్ ఇవ్వాలి సార్ అని అడిగారు.
స్టేట్ మెంట్ ఇవ్వటానికి నిజంగా ఆయనపై దాడి జరిగిందా? లేకపోతే ఆయనే కొట్టుకున్నాడో ఎవరికి తెలుసు? దాడి జరిగిన సమయంలో కరెంటు పోయింది. పూలదండలో రాయి పెట్టి ఆయనే కొట్టుకున్నాడేమో? నిజంగా దాడి జరిగితే ఆ దాడి చేసిన వాడిని పట్టుకోండి. ఎన్నికల ముందు సెంటిమెంట్ డ్రామాలు చేస్తున్నారు. నాటకాలు ఆపండి.. భరించలేకపోతున్నాం’’ అంటూ మండిపడ్డారు.