జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వచ్చే ఎన్నికలకు సంబంధించి తాజాగా శనివారం రాత్రి పొద్దుపోయాక సంచలన ప్రకటన చేశారు. పొత్తుల గురించి ఆలోచించేందుకు సమయం ఉందని తెలిపారు. పొత్తులు ఖాయమేనని అయితే.. ఇప్పుడే దీనిపై దృష్టే ఆలోచన తనకు లేదని చెప్పారు. ఒంటరిగా వెళ్లాలా, కలసి వెళ్లాలా అనేది తరవాత మాట్లాడుకునే విషయమని స్పష్టం చేశారు. దీనికి ముందు పార్టీ పరిస్థితిని మండల స్థాయిలో సమగ్ర అధ్యయనం తర్వాతే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
“మనం బలంగా పని చేస్తే అధికారం దానంతట అదే వచ్చి తీరుతుంది. నాయకులు అందుకు అనుగుణంగా అడుగులు వేయా లి“ అని పవన్ పేర్కొన్నారు. వారాహి విజయ యాత్ర మలి దశకు ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించాలని కోరారు. తొలి దశ వారాహి విజయ యాత్రకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి తూర్పు గోదావ రి జిల్లాలో వారాహి విజయ యాత్ర సాగిన నియోజకవర్గాల ఇంఛార్జులు, పరిశీలకులు బాగానే పనిచేశారని వ్యాఖ్యానించారు.
“జనసేన పార్టీ ప్రజల్లోకి బలంగా వెళ్తుంది. ఎలాంటి సమస్యపై మనం మాట్లాడినా అది ప్రజల్లోకి చేరిపోతోంది. పార్టీ ప్రజల్లోనే ఉంది. ఉభయ గోదావరి జిల్లాల్లో అది మరింత బలంగా ఉంది. యాత్రకు జనం వస్తున్నారు నాయకత్వం దాన్ని అందిపుచ్చు కోవాలి. వారాహి విజయ యాత్ర విజయం తాలూకు పునాదులను ఆసరాగా చేసుకుని ముందుకు వెళ్లాలి“ అని కార్యకర్తలు, నాయకులకు పవన్ పిలుపునిచ్చారు.
రూల్ ఆఫ్ లా ఏమైంది?
ఏపీలో `రూల్ ఆఫ్ లా` నాశనం అయిపోయిందని పవన్ విమర్శలు గుప్పించారు. ఏ పార్టీ అయినా `రూల్ ఆఫ్ లా`కి కట్టుబడి పని చేయాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వం దీనిని పూర్తిగా విస్మరించిందని దుయ్యబట్టారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనే అంశాన్ని అవివేకంతో మాట్లాడడం లేదని, జగన్, వైసీపీ నాయకులు వెళ్లే మార్గం తప్పు కాబట్టే.. వైసీపీ పాలనలో అవినీతి తారా స్థాయికి చేరిపోయింద కాబట్టే.. ఈ పిలుపునిచ్చినట్టు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
వైసీపీ సర్కారుపై 70 శాతం ప్రజలకు విశ్వాసం పోయిందని పవన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో గంజాయి విక్రయాలు పెరిగిపోయాయన్నారు. రాష్ట్రంలో 30 వేల మంది అమ్మాయిలు కనిపించకుండా పోయారని, ఈ అంశం మీద కనీసం రివ్యూ చేసే పరిస్థితులు కూడా లేవని వ్యాఖ్యానించారు. దీనిని చాలా పెద్ద సమస్యగా పవన్ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోలేకపోతే రాష్ట్రం అధోగతిపాలవుతుందని అన్నారు.