జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కోపం వచ్చింది. గతంలో ఎప్పుడూ అనని మాటలు ఆయన నోటి నుంచి వచ్చాయి. సాధారణంగా వ్యక్తిగత వైరాలు తనకు ఉండవని తరచూ చెప్పే ఆయన.. తన తీరుకు భిన్నంగా వ్యక్తిగతంగా ఒక నేతను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయటం సంచలనంగా మారింది. పవన్ లాంటోడికి సైతం సహనం కోల్పోయేలా చేసిన ఘనత ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు సొంతమంటున్నారు. తన నోటి తీరుతో ఇప్పటికే సొంత పార్టీ నేతల్ని దూరం చేసుకున్న ఆయన.. నియోజకవర్గంలో ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సొంత పార్టీ నేతలు.. అధికారులు.. సామాన్యులు..ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఎవరితోనైనా పేచీ పెట్టుకునే అన్నాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు పవన్ కల్యాణ్. తమ పార్టీ కార్యకర్త ఒకరు.. స్థానిక సమస్యపై ఎమ్మెల్యేను ప్రశ్నించగా.. రాయలేని బూతుపురాణం ఎత్తుకోవటంతో పాటు.. తీవ్రంగా బెదిరించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
అందరి ముందు చెడామడా తిట్టేసిన ఎమ్మెల్యే అన్నా రాంబాబు తీరుతో మనస్తాపానికి గురైన బాధితుడు.. తాజాగా ఆత్మహత్య చేసుకోవటం కలకలం రేపింది. తమ పార్టీ కార్యకర్త మరణానికి కారణమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అన్నా రాంబాబును వదిలేది లేదన్నారు. జనసేన కార్యకర్తలపై పదే పదే దాడులు చేస్తే ఎలా ఎదుర్కోవాలో తమకు బాగా తెలుసని హెచ్చరించారు.
ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా వచ్చే ఎన్నికల్లో అన్నా రాంబాబు అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చూసే బాధ్యతను తాను తీసుకుంటానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు జనసేనాని. తాజాగా ఒంగోలుకు వచ్చిన ఆయన.. ఎమ్మెల్యే అన్నా వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా చెబుతున్న బాధితుడి కుటుంబ సభ్యుల్ని ఓదార్చి వారికి ఆర్థిక సాయాన్ని అందించారు. అదే సమయంలో.. జిల్లా ఎస్పీని కలిసి.. పవన్ వినతి పత్రం సమర్పించారు. కార్యకర్త వెంగయ్య ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.