తెరపైన కనిపించే వాళ్లందరూ హీరోలు అయిపోరు. బయట కూడా అవసరం పడినపుడు హీరోయిజం చూపించాలి. కాస్త దృఢంగా నిలబడాలి. వ్యక్తిత్వాన్ని చాటుకోవాలి. స్వార్థ ప్రయోజనాల కోసమో.. లేక ఎవరినో మెప్పించడానికో.. లేక ఎవరికో భయపడో.. చేయకూడని పనులు చేస్తే, అనకూడని మాటలు అంటే మన వ్యక్తిత్వానికి విలువ ఉండదు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నాడు.
తన కొత్త చిత్రం ‘సర్కారు వారి పాట’లో మహేష్ బాబు పలికిన ఒక డైలాగ్ సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకతకు కారణమవుతోంది. ఆ డైలాగ్.. ‘‘నేను విన్నాను, నేను ఉన్నాను’’ అని ఈపాటికే అర్థమైపోయి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని మెప్పించడానికి, తన సినిమాకు ప్రయోజనం చేకూర్చడానికే అవసరం లేకుండా ఆయన ఈ డైలాగ్ చెప్పాడని బలంగా నమ్ముతున్నారు నెటిజన్లు.
ఆంధ్రప్రదేశ్ టికెట్ల రేట్లకు సంబంధించి జగన్ సర్కారు లేని సమస్యను తనే సృష్టించి.. ఆ తర్వాత చిరంజీవి సహా ఇండస్ట్రీ ప్రముఖులు తన ముందు సాగిలపడేలా చేసుకుని.. చివరికి ఏదో పెద్ద సమస్యను పరిష్కరించినట్లు బిల్డప్ ఇచ్చుకోవడం తెలిసిందే. ఐతే ఇప్పటికే ఇండస్ట్రీ వైపు నుంచి జగన్‌ను మెప్పించడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. అయినా ఇగోకు మారుపేరైన జగన్ ఇంకా తగ్గట్లేదు.
పెద్ద సినిమాలకు అదనంగా రేట్లు పెంచుకునే విషయంలో ఒక మెలిక పెట్టి.. తనను మెప్పించిన వారికే ఆ ఆఫర్ ఇస్తున్నాడు. ధిక్కరించే వారికి మొండిచేయి చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే జగన్‌ను మెప్పించడానికి మహేష్ ‘యాత్ర’ సినిమాలో వైఎస్ పాత్ర నుంచి నుంచి వచ్చిన డైలాగ్‌ను తన సినిమాలో పెట్టించడానే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జగన్ ఎన్నికల ప్రచారంలోనూ ఈ మాట వాడుకోవడం తెలిసిందే. కానీ జగన్ ఏం విన్నాడో, ఏం చేశాడో మూడేళ్లుగా అందరూ చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు జగన్ మీద, ఆయన ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు జనాలు. ఇలా వాళ్లు మంటెక్కిపోతున్న టైంలో మహేష్.. జగన్ డైలాగ్‌ను వల్లెవేయడంతో నెటిజన్ల ఆగ్రహం మామూలుగా లేదు.
నేను విన్నాను నేను ఉన్నాను…#SarkaruVaariPaata
శుక్రవారం వచ్చి సంతకం పెట్టారా నా కొడకా…..#BheemlaNayak
— Sree (@SreeTweetz_) May 2, 2022
ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ఎలా వ్యవహరించాడో ఒకసారి చూసుకోవాలి. తనను టార్గెట్ చేయడానికి ఇండస్ట్రీనే టార్గెట్ చేయడంతో గత ఏడాది ‘రిపబ్లిక్’ టైంలో పవన్ ఎలా జగన్ తీరును దుయ్యబట్టాడో తెలిసిందే. పైగా ‘మనల్ని ఎవర్రా ఆపేది’ అంటూ దమ్మున్న పంచ్ విసిరాడు.
అంతే కాక ‘భీమ్లా నాయక్’కు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెడతారని తెలిసి కూడా ‘‘శుక్రవారం వచ్చి సంతకం పెట్టరా నా కొడకా’’ అంటూ ఒక పేలిపోయే డైలాగ్ పెట్టాడు సినిమాలో. ఆ డైలాగ్ ఎవరికి తగులుతుందో అందరికీ తెలుసు. ఇప్పుడు మహేష్ పలికిన డైలాగ్‌ను, అప్పుడు పవన్ పేల్చిన డైలాగ్‌ను పోల్చి ఇద్దరికీ ఉన్న తేడా ఇదీ అంటూ నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు.