పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ పై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ కు భయాన్ని పరిచయం చేసింది జనసేన అని, ఈ రోజు రోడ్డు మీదకు రావడానికి కూడా జగన్ భయపడుతున్నాడు అంటే అందుకు కారణం జనసేన అని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో ఓడిపోతానని జగన్ కు భయం పట్టుకుందని, అందుకే మన హక్కులను అణచివేయాలని చూస్తున్నాడని ఆరోపించారు.
పదేళ్ల నుంచి ధర్మం కోసం పోరాడుతున్నానని పవన్ అన్నారు. తనను తిట్టి, తన భార్యా బిడ్డలను తిట్టి అవమానించినా ప్రజల కోసం భరించానని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కుటుంబం నష్టపోయినా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలని తన భార్యకు చెప్పి వచ్చానని పవన్ అన్నారు. ఒక ఎమ్మెల్యే కూడా లేకుండా ఇన్నేళ్లు ఏ రాజకీయ పార్టీ నిలబడలేదని, అది తన గొప్పతనం కాదని, జనసేన ని గుండెల్లో పెట్టుకున్న వీర మహిళలు, జనసైనికుల పోరాట స్ఫూర్తి వల్లే ఇది సాధ్యమని అన్నారు.
రాష్ట్ర దశా, దిశా మార్చేందుకు పిఠాపురం నుంచి మార్పునకు శ్రీకారం చుట్టానని, రెండు తరాల భవిష్యత్తుకు బాటలు వేసేందుకే తాను పోరాడుతున్నానని చెప్పారు. తనకోసం ప్రచారం చేసేందుకు వచ్చిన సాయి ధరమ్ తేజ్ పై గాజు సీసాతో దాడికి ప్రయత్నించారని, ఇటువంటి దాడులు తమను భయపెట్టలేవని అన్నారు. వైసీపీ నేతలు డబ్బులిస్తే తీసుకోవాలని, కానీ, ఓటు మాత్రం జనసేనకే పడాలని, గాజు గుర్తుపైనే ఓటు వేయాలని పవన్ పిలుపునిచ్చారు.