ఏపీలో సీఎం జగన్ పాలనలో నియంతృత్వ పోకడలు ఎక్కువయ్యాన్న ఆరోపణలు బాగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు బనాయించడం తరహా వ్యవహారాలు ఎక్కువయ్యాయన్న విమర్శలు వస్తున్నాయి. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కొన్ని జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అది నిజమేనేమో అన్నట్టుగా అనిపిస్తోంది.
ప్రజాసమస్యల గురించి ప్రశ్నించిన వారిపై వైసీపీ నేతలు కక్షసాధింపులు, వేధింపులకు దిగుతున్నారన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలోనే తమ ప్రాంత సమస్యలపై గిద్దలూరు ఎమ్మెల్యే, వైసీపీ నేత రాంబాబును ప్రశ్నించిన జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడును ఆయన బూతులు తిట్టిన ఘటన సంచలనం రేపింది.
ఇది బాగా వైరల్ అవడంతో ఎమ్మెల్యే రాంబాబు ను నెటిజన్లు ఏకిపారేశారు. ఎమ్మెల్యే చేత తిట్లు తిన్న వెంగయ్య ఆత్మహత్య చేసుకోవడం పెను దుమారం రేపుతోంది. ఎమ్మెల్యే రాంబాబు దూషించారన్న మనస్తాపంతోనే వెంగయ్య ఆత్మహత్య చేసుకున్నాడని జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ విషాద ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఎమ్మెల్యే రాంబాబుపై క్రిమినల్ కేసు నమోదుకు జనసేన అధినేత డిమాండ్ చేశారు.
సమస్యలపై ప్రశ్నిస్తే ప్రాణాలు పోగొట్టుకోవలసిందేనా అని ప్రశ్నించారు. వెంగయ్య ఆత్మహత్యకు ప్రభుత్వం బాధ్యత వహించాలని పవన్ డిమాండ్ చేశారు. వెంగయ్య ఆత్మహత్య బాధాకరమని పవన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యకు అధికార పక్షం బాధ్యత వహించాలని, వైసీపీ నిరంకుశ పాలనకు ఇది నిదర్శనమని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రామంలో పారిశుద్ధ్య సమస్యపై ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకే దూషించారని, ఆ సమస్యపై కనీసం సమాధానం ఇవ్వలేని స్థితిలో ఎమ్మెల్యే రాంబాబు ఉన్నారని మండిపడ్డారు. వెంగయ్యను ప్రజల మధ్యనే ఎమ్మెల్యే బెదిరించారని, వివిధ రూపాల్లో ఒత్తిళ్లకు గురి చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పవన్ డిమాండ్ చేశారు. వెంగయ్య ఆత్మహత్య నేపథ్యంలో వైసీపీ నేతల తీరుపై విమర్శలు వస్తున్నాయి. సమస్యలపై ప్రశ్నించిన వెంగయ్యను ఎమ్మెల్యే, ఆయన అనుచరులు తీవ్ర వేధింపులకు గురిచేశారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ రకమైన ధోరణితో ప్రజలు భయభ్రాంతులవుతున్నారని, తమ సమస్యలు చెప్పుకునేందుకు కూడా భయపడుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వైసీపీకి ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలు, ప్రజాసమస్యలు గుర్తుకు వస్తాయన్న విమర్శలు వస్తున్నాయి. అధికారం ఉంది కదా అని ఈ రీతిలో వ్యవహరించడం సరికాదన్న వాదన వినిపిస్తోంది. ప్రశ్నించే గొంతును వైసీపీ నేతలు ఎన్ని రోజులు తొక్కిపడతారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. జమిలి మరో ఏడాదిలో వస్తాయంటున్నారు. జమిలి రాకపోయినా ఇంకో మూడేళ్లలో సాధారణ ఎన్నికలు వస్తాయి. ఇపుడు పోలీసుు భయంతో జనం తమ కోపాన్ని బయటకు చెప్పలేకపోవచ్చు, వైసీపీ నేతల వేధింపులకు భయపడొచ్చు. కానీ ఎన్నికలు వచ్చిన రోజు ఓటు రూపంలో అది బయటకు రాకమానదు.
ఇటీవలే చిత్తూరులో ఇలాంటి ఘటన జరిగింది. మద్యం విషయంలో ప్రభుత్వం ఇస్తున్న క్వాలిటీపై ఓ యువకుడు ప్రభుత్వాన్ని విమర్శించాడు. జగన్ పై కొన్ని బూతులు మాట్లాడారు. ఆ వీడియో వైరల్ కావడంతో రెండ్రోజుల్లో ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ దళితయువకుడిని వైసీపీ నేతలు బెదిరించారని, తెలుగుదేశం నేత నారా లోకేష్ ఆరోపించారు. తాజాగా గిద్దలూరు లో జరిగిన ఈ ఘటన కూడా అలాంటిదే కావడం గమనార్హం. ప్రెస్ నోట్ లో పవన్ చేసిన డిమాండ్లకు ప్రభుత్వం దిగొస్తుందా? ఎమ్మెల్యేపై కేసు పెడుతుందా? పెట్టకపోతే జనసేన పార్టీ ఏం చేయనుంది? పవన్ గిద్దలూరు కు వెళ్తారా? ప్రభుత్వంపై పోరాడతారా? ఇవన్నీ శేష ప్రశ్నలు.