జనసేన ఆవిర్భావ సభ ప్రిపరేషన్ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన విజయవాడలో తిష్టవేశారు. తాజాగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మొదటి సమావేశంలో ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఈ సమావేశం బీసీల సమస్యలు, వారి రాజకీయ సాధికారతపై జరిగింది. ఈ టాపిక్ పై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాను ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం కాపులే అన్నారు. 2019 ఎన్నికల్లో తాను పోటీ చేసిన స్థానాల్లో ఓటమి చెందటానికి కారణాలు ఏమిటన్న దానిపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు బీసీలు ఓట్లు వేశారని, కానీ కాపులు ఓట్లు వేయలేదని అన్నారు. తాను కాపు సామాజిక వర్గానికి చెందిన వాడినే అయినప్పటికీ.. తనను కాపుగా మాత్రం చూడొద్దన్న మాట ఆయన నోటి నుంచి తరచుగా వచ్చేది. అలాంటి పవన్ నిన్నటి మీటింగ్లో ఇలా మాట్లాడటం సంచలనం అయ్యింది.
‘‘ఎన్నికల్లో నన్నుకాపులు ఓన్ చేసుకొని ఉంటే నేను ఓడిపోయేవాడిని కాదు. గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీకి వచ్చిన ఓట్లలో సగానికి పైగా బీసీలు వేసినవే’’ అని పేర్కొన్నారు. తాను ఏ ఒక్క కులానికి చెందిన నాయకుడిని కాదు. అన్ని కులాల వారికి నాయకుడిగా ఉండాలనుకుంటున్నాను. తూర్పుగోదావరి జిల్లాలో కాపులకు.. శెట్టి బలిజలకు పడదని.. రెండు వారాలు అక్కడే కూర్చొని వారి మధ్య సయోధ్య చేసిన వైనాన్ని చెప్పుకొచ్చారు. దాని ఫలితంగానే శెట్టి బలిజల పండుగకు కాపులు శుభాకాంక్షలు చెప్పే పరిస్థితి వచ్చిందన్న విషయాన్ని గుర్తు చేయటం గమనార్హం.