వరదలతో తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయి. ప్రభుత్వం సాంకేతికంగా పూర్తి స్థాయిలో తన సమర్థత చూపలేకపోవడంతో వరద ముగిసిన అనంతరం ఆయా నీట మునిగిన ప్రాంతాలు వేగవంతంగా కోలుకోలేకపోయాయి. అది పక్కన పెడితే ఎపుడూ డబ్బులు ఇచ్చే కేసీఆర్ నోరు తెరిచి విరాళాలు అడిగారు. దీంతో అనేకమంది స్పందించారు.
ప్రభుత్వంతో వేల కోట్ల కాంట్రాక్టులు పొందే మెగా వాళ్లు, మైహోం వాళ్లు విరాళాలు ఇచ్చారు. అందులో వింత ఏం లేదు.అయితే, సినిమా వాళ్లు కూడా తమ వంతు సాయం ప్రకటించారు. చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ లు రూ కోటి ఇవ్వగా, ఎన్టీఆర్ 50 లక్షలు, నాగార్జున 50 లక్షలు ఇచ్చారు. పలు ఇతర సినీ ప్రముఖులు కూడా బాగానే స్పందించారు.
అయితే, వాళ్లు ఎంతో సంపాదించుకుని తక్కువ ఇస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు వచ్చాయి. ఈరోజు సోషల్ మీడియా కోసం పార్టీ విడుదల చేసిన పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూలో పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.నిజానికి సినిమా వాళ్లకు పేరు ఎక్కువ ఉంటుందని, డబ్బు ఎక్కువ ఉండదని అన్నారు.
ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, పెట్టుబడిదారులు, ఎగుమతి దారుల వద్ద వందలు వేల కోట్ల డబ్బు ఉంటుందని… అవి వారి లాభాలు అని, సినిమా వాళ్లు మాత్రం కష్టపడి సంపాదించిన డబ్బు అని అన్నారు. కష్టపడి సంపాదించిన డబ్బులోంచి ఒక 10 రూపాయలు తీయాలంటే అంత సులువైన విషయం కాదన్నారు. అలాంటిది సినిమా వాళ్లు శక్తికి మించే విరాళాలు ఇస్తున్నారని అన్నారు.ఎన్నికల పెట్టుబడిగా భావించి రాజకీయ నాయకులే ఇపుడు డబ్బులుతీసి బాధితుల కోసం ఖర్చుపెట్టాలన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అక్రమకట్టడాలపై దృష్టిపెట్టి ఇలాంటి సమస్యను మళ్లీ రాకుండా చూడాలి. ఇప్పటివరకు ఇలాంటి వరద రాలేదు కాబట్టి తెలియలేదు. కానీ ఇక ముందు ఇలాంటి పరిస్థితి రావద్దు. ఆ దిశగా ముందుకు వెళ్లాలి. చక్కటి అర్బన్ ప్లానింగ్ తో పాలించాలి. ఇపుడు భారీ ప్రాణ నష్టం జరిగింది. ఇక ముందైనా అలా జరగకుండా చూడటం ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యం. ఇంకా పవన్ కళ్యాణ్ పలు విషయాలపై స్పందించారు. దానిని ఈ వీడియోలో చూడొచ్చు.