జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర నిర్విరామంగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. యాత్ర సందర్భంగా నిర్వహిస్తున్న బహిరంగ సభలలో పవన్ కల్యాణ్…అధికార పార్టీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పి.గన్నవరంలో జనసేన నేతలతో సమావేశమైన పవన్ కల్యాణ్…సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలపై మండిపడ్డారు. తాను సినిమాలు తీసి పార్టీని నడుపుతున్నానని, ఇసుక దోపిడీ, మైనింగ్ దోపిడీ చేయడం లేదని దుయ్యబట్టారు. తాను కూడా దోపిడీ చేసే టైపు అయితే జనసేన ఎందుకని, వైసీపీ చాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
స్థానిక సమస్యలపై జనసేన నేతలు ఉద్యమించాలని, పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. గోదావరి జిల్లాలపై స్పెషల్ ఫోకస్ పెడతానని, టైం కేటాయిస్తానని పవన్ అన్నారు. అక్రమ మట్టి, ఇసుక తరలింపుపై ఎక్కడికక్కడ జనసేన పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. తప్పు చేసిన వారికి శిక్ష పడేందుకు కులం చూడొద్దని, ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా శిక్షపడాలని, హత్య చేసిన దోషులను పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనవాడు తప్పు చేసినా శిక్షించాల్సిందే అన్నారు. నాయకులు చేసే తప్పులు ప్రజలకు ఇబ్బందికరంగా మారుతున్నాయని చెప్పారు.
జనసేన నాయకులకు ఇప్పుడున్న కమిట్మెంట్ 2009లో ఉండి ఉంటే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ విలీనం చేయాల్సిన అవసరముండేది కాదన్నారు. ఎమ్మెల్యేగా గెలిచినవారికి కమిట్మెంట్ ఉండాలని, జవాబుదారీతనం లేని నాయకులంటే తనకు ఆసక్తి ఉండదని చెప్పారు. 2014లో చీకట్లో బయలుదేరిన నాకు 2019లో రాజోలు చిరుదీపం అందించిందని, రాజోలు నుండి జనసేన తరఫున గెలిచిన ఎమ్మెల్యే వెళ్లిపోయినా ఇక్కడి వారు తమను గెలిపించారని గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో మార్పు తీసుకువస్తామంటే ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా వెళ్లిపోయాడని రాపాకనుద్దేశించి విమర్శించారు.
గోదావరి జిల్లాలో 18శాతం జనసేనకు ఓటు వేశారని అన్నారు. గోదావరి జిల్లాల్లో భూగర్భజలాలు కలుషితమవుతున్నాయని, తాను రెండు చేతులు జోడించి చెబుతున్నానని, తాను కలవలేదని అనుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజల కష్టాన్ని తాను గుర్తిస్తానని, తాను రోడ్డు మీద ఆగి కూడా సామాన్యులతో మాట్లాడతానని చెప్పారు.