ఏపీ ప్రభుత్వంపై జనసేనాని పవన్ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. తాజాగా కోనసీన జిల్లాలో జరిగిన కల్లోలంపై ఆయన స్పందించారు.
జనసేన నేతల హస్తం ఉందంటూ.. మంత్రి తానేటి వనిత చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. సుమారు గంట సేపు మీడియాతో మాట్లాడిన పవన్.. అసలు రాష్ట్రంలో కుల రాజకీయాలు చేస్తున్న పార్టీ వైసీపీనేనని చెప్పారు. కుల రాజకీయాల విషయంలో ఇతర పార్టీలకు వంకలు పెట్టాల్సిన అవసరం వైసీపీకి లేదన్నారు.
“రాష్ట్రంలో వైసీపీ కుల రాజకీయాలకు ఆజ్యం పోసింది. వైఎస్సార్ కడప జిల్లా పేరు పెట్టినప్పుడు ఎస్సీలు నా వద్దకు వచ్చారు. కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టేలా చూడాలని కోరారు. మొదటి ఎస్సీ ముఖ్యమంత్రి పేరు పెట్టడం మంచిదని సూచించారు. మా ప్రభుత్వం వచ్చినప్పుడు కర్నూలు జిల్లాకు పేరు పెడతామని చెప్పా.“ అని పవన్ వివరించారు. అయితే.. మరికొందరు తన వద్దకు వచ్చిన కర్నూలు జిల్లాకు ఆపేరే ఉంచాలని కోరారని.. దీంతో ఆ విషయాన్ని తాను అక్కడితో సర్ది చెప్పానని వివరించారు.
ఇప్పుడు కోనసీమ విషయంలోనూ.. ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబించకుండా.. వ్యవహరించాలని పవన్ సూచించారు. “అంబేడ్కర్ స్ఫూర్తిని అమలు చేయటం మాని వేరే పనులు చేస్తున్నారు. అంబేడ్కర్‌పై ప్రేమ ఉంటే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ సజావుగా అమలు చేయాలి.
గత రెండేళ్లలో రూ.10 వేల కోట్లు దారిమళ్లించారు. దళితవాడల్లో మౌలిక వసతులు కల్పించడంలో విఫలమయ్యారు. ఎస్సీలకు ఇవ్వాల్సిన వాహనాలు ఇవ్వడం లేదు. ఎస్సీలకు సివిల్స్, గ్రూప్స్ వంటి పోటీపరీక్షలకు శిక్షణ ఇవ్వటం ఆపేశారు. అంబేడ్కర్ విదేశీ విద్యా దీవెనకు నిధులు ఇవ్వటం లేదు.“ అని పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి విశ్వరూప్ ఇంటిపై దాడి జరుగుతుంటే పోలీసులు చూస్తూ ఉంటారా? అని.. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారంటే ఏమనుకోవాలని పవన్ నిలదీశారు. ఘోరాలను ఆపకుండా జరిగేలా చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైపెచ్చు జనసేనపై ఆరోపణలు చేస్తారా? అని మండిపడ్డారు. కులసమీక రణపై రాజకీయాలు చేస్తారా? ధ్వజమెత్తారు. భావోద్వేగాలు ఉంటాయని తెలిసే రెచ్చగొట్టారని ఆరోపించా రు. ఇలాంటి ఘటనలతో ఎస్సీల్లో ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిందన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత నుంచి బయట పడేందుకే గొడవలు రేపారని దుయ్యబట్టారు.