ఢిల్లీలో పడిగాపుల అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో జనసేన అధినేత పవన్ సమావేశం విజయవంతంగా జరిగింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ghmc ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నికల్లో తమ పార్టీకి తగిన మర్యాద ఇవ్వలేదని అలిగి ఢిల్లీ వెళ్లిన పవన్… మొత్తానికి నడ్డాతో కలిసిన అనంతరం కాస్త సంతోషంగానే కనిపించారు.
నడ్డా మీటింగ్ అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. అమరావతి, పోలవరం అంశాలపై నడ్డాతో మాట్లాడామని పవన్ చెప్పారు. అమరావతి రైతులకు బీజేపీ, జనసేన పూర్తి అండగా ఉంటాయని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అవినీతి, లా అండ్ ఆర్డర్ మిస్సింగ్, ఆలయాలప వరుస దాడులు తదితర కీలక అంశాలు కూడా చర్చకు వచ్చిన ట్లు పవన్ చెప్పారు.
అమరావతి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని జేపీ నడ్డా హామీ ఇచ్చినట్లు చెప్పిన పవన్ రైతులకు కచ్చితంగా న్యాయం జరుగుతుందంటున్నారు. అయితే, రైతులు కోరుకుంటున్నది అమరావతి రాజధానిగా ఉండాలని మాత్రమే. అంతకుమించి వారు ఏమీ అడగడం లేదు. కానీ బీజేపీ, జనసేనలు పిల్లి మొగ్గలు వేస్తూ అమరావతి గురించి మాట్లాడకుండా రైతులు, మేళ్లు అంటూ మాట్లాడుతున్నారు.
ఇక పవన్ స్పష్టంగా రెండు విషయాలు చెప్పారు. ఒకటి దేవాలయాల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని ఒకమాట. తిరుపతి ఉప ఎన్నికలో గతంలో ప్రకటించినట్లు కాకుండా… ఇరు పార్టీల తరఫున ఉమ్మడి కమిటీ వేసి అభ్యర్థిని ఎంపిక చేస్తామని అన్నారు. అంటే తిరుపతిలో ఏ పార్టీ పోటీ చేస్తుందన్నది ఇంకా క్లారిటీ రాలేదన్నమాట.