మీడియా అప్రాధాన్యమైన విషయాలకు ప్రాధాన్యం ఎక్కువ ఇస్తోంది. ఒక సినిమా వ్యక్తి 50 కిలోమీటర్ల స్పీడుతో ఆటోను దాటి కిందపడితే దానిమీద రోజురోజులు బ్రేకింగులు నడుపుతారు. కానీ లక్షల మందికి అన్యాయం జరుగుతుంటే నోరెత్తి మాట్లాడరు. ఎవరికి భయపడుతున్నారు? భయపడాల్సిన అవసరమా? లేక ప్రేమా?
లక్షలాది పోడు భూముల్లో గిరిజనులు వ్యవసాయం చేసుకుంటూ వుంటే అది వారికి దక్కడం లేదు. దాని గురించి మాట్లాడండి.
ఆరేళ్ల చిన్నారి చరిత అన్యాయంగా, అకారణంగా, అమానుషంగా హత్యకు గురైతే అది చర్చకు తేండి.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్స్ గురించి మాట్లాడి, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు రిజర్వేషన్స్ గురించి ఎందుకు మాట్లాడటం లేదో మరిచిపోయిన ముఖ్యమంత్రిని ప్రశ్నించండి.
రాయలసీమలో బలిజలు ఎందుకు నలిగిపోతున్నారు.. బోయ కులస్థులకు ఎందుకు రాజకీయ ప్రాతినిధ్యం రావడం లేదు… ఓ ఆడపిల్ల బయటకు వెళితే క్షేమంగా ఎలా బయటకు రావాలో వంటి విషయాలపై కథనాలు నడపండి.
ఇలాంటివి రాస్తే మేం గౌరవిస్తాం. జనం గౌరవిస్తారు. కానీ సినిమా హీరోల మీద, సినిమా వాళ్ల గురించి ఎందుకు మాట్లాడుతారు? వాళ్లు సాఫ్ట్ టార్గెట్స్. వాళ్లనేమైనా అంటే ఎవరూ ఏమనరు.
రాజకీయ నాయకుల గురించి మాట్లాడరు. ఇడుపుల పాయలో నేలమాళిగల్లో డబ్బులుంటాయని పోలీస్ వ్యవస్థే చెబుతుంటుంది. అది ఎంత నిజమో వెలికితీయండి. మీరు రాయరు… ఎందుకంటే ఇళ్లలో కొచ్చి కొడతారు. అందుకే వాళ్ల గురించి మాట్లాడరు. తేజ్ అమాయకుడు కదా!. కళ్లు తెరవకుండా అక్కడ పడున్నాడు కదా, హాస్పిటల్లో అందుకే ఇష్టానుసారం మాట్లాడతారు, రాస్తారు.
తేజ్ గురించి మాట్లాడితే ప్రజలకు ఉపయోగమా?
పొలిటికల్ క్రైమ్ గురించి మాట్లాడండి. ప్రజల సమస్యల గురించి మాట్లాడండి. వై.ఎస్.వివేకానందరెడ్డి ఎందుకు హత్య చేయబడ్డారు అని కథనం వేయండి. తేజ్ యాక్సిడెంట్ కాదు. ఓ నాయకుడిపై కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే ఎయిర్పోర్టులో కోడికత్తితో దాడి జరిగింది. అదేమైందని అడగండి…తేజు యాక్సిడెంట్ గురించి కాదు. అంటూ మీడియాను పవన్ కడిగి పారేశారు.