బీజేపీతో బంధాన్ని జనసేనాని పవన్ కళ్యాణ్ తెంచుకోవాలనుకుంటున్నారా? పొత్తుకు ముగింపు పలకాలనుకుంటున్నారా? అందుకు సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా? అంటే రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ పోరాటాలకు దూరంగా ఉంటున్న పవన్.. త్వరలోనే బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా ఆయన సమయం కోసం ఎదురు చూస్తున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
2014లో జనసేన పార్టీని పవన్ స్థాపించారు. ఆ ఏడాది ఎన్నికల్లో ఇటు రాష్ట్రంలో టీడీపీతో అటు కేంద్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఏపీలో బాబు గెలవగా.. కేంద్రంలో మోడీ విజయం సాధించారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడంలో మోడీ సర్కారు విఫలమైందని భావించడంతో పాటు ఇతర కారణాల వల్ల బీజేపీకి పవన్ దూరమయ్యారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసి దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఆ తర్వాత రెండేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కారు తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో మరోసారి పవన్ పొత్తు పెట్టుకున్నారు.
పొత్తయితే పెట్టుకున్నారు కానీ ఈ రెండు పార్టీలు కలిసికట్టుగా ముందుకు సాగడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొదట్లో ఉమ్మడిగా కలిసి జగన్ సర్కారు వైఫల్యాలపై పోరాడిన ఈ పార్టీలు.. ఆ తర్వాత ఎవరి దారి వారిదన్నట్లు వ్యవహరిస్తున్నాయి. జనసేన సొంతంగానే అధికార ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తోంది. మరోవైపు పార్టీలో అంతర్గత నేతల నుంచి కూడా బీజేపీకి గుడ్‌బై చేయాలన్న ఒత్తిడి పెరుగుతోంది.
బీజేపీ పొత్తుతో కారణంగా మైనార్టీ ఓటు బ్యాంకు జనసేనకు దూరమవుతుందనే అందుకు ఓ కారణం. ముఖ్యంగా ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న రాయలసీమ జిల్లాల్లో ఈ ఒత్తిడి ఎక్కువగా ఉంది. మరోవైపు బీజేపీ వివాదాస్పద అంశాల్ని వరుసగా తెరపైకి తెస్తూ మైనార్టీలను వాళ్ల మద్దతు తీసుకుంటున్న వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. అందుకే ప్రొద్దుటూరు టిప్పుసుల్తాన్ విగ్రహం వివాదంలో జనసేన దూరంగా ఉండిపోయింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసిన జనసేన ఆశాజనకమైన ఫలితాలే సాధించింది.
తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీని వదిలించుకునేందుకు జనసేన తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. సరైన కారణం లేకుండా విడిపోతే అది తమ పార్టీపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే సరైన కారణం కోసం జనసేన ఎదురుచూస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోరాటంపై జనసేన దృష్టి సారించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. విశాఖ స్టీల్‌ను ప్రైవేటు పరం చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.
ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రంలోని అన్ని పార్టీలో వ్యతిరేక గళం వినిపిస్తుండగా.. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేన ఇప్పటివరకూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ తాజాగా పవన్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నారు. ఆ విషయాన్ని జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. దీంతో కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా పొత్తు ఉపసంహరించుకుంటున్నట్లు జనసేన ప్రకటించే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.