కొత్త జిల్లాలకు పేర్లు పెట్టేటప్పుడే అంబేడ్కర్ పేరు పెట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంత్రి విశ్వరూప్ ఇంటిపై దాడి జరుగుతుంటే పోలీసులు చూస్తూ ఉంటారా? అని ప్రశ్నించారు. కులసమీకరణతో రాజకీయాలు చేస్తారా? అని ధ్వజమెత్తారు. భావోద్వేగాలు ఉంటాయని తెలిసే రెచ్చగొట్టారని ఆరోపించారు. కోనసీమలో మంగళవారం జరిగిన ఘటనకు వైసీపీ ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు.
కోనసీమ ప్రాంతానికి అంబేడ్కర్ పేరు పెట్టారని.. అదేదో జిల్లాలకు కొత్త పేర్లు పెట్టినప్పుడే అంబేడ్కర్ పేరు పెట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని పవన్ అన్నారు. మిగతా జిల్లాలతో పాటు అంబేడ్కర్ పెడితే సహజంగా ఉండేదని అభిప్రాయపడ్డారు.
అంబేడ్కర్ పేరు పెట్టడంలో జాప్యమెందుకు జరిగిందో అర్థం కావట్లేదని… రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములును ఒక జిల్లాకే కుదించారని చెప్పారు. కృష్ణా నది తక్కువగా ఉన్నచోట కృష్ణా జిల్లా పెట్టారని.. ఎక్కువగా ఉన్నచోట ఎన్టీఆర్ అని పేరు పెట్టారని అన్నారు.
జిల్లా పేర్లకు వ్యతిరేకమైనా.. జనసేన జాతీయ నాయకులకు, వ్యక్తులకు వ్యతిరేకం కాదని వ్యాఖ్యానించారు. పేర్లు పెట్టేటప్పుడు ప్రభుత్వం సున్నితంగా వ్యవహరించాలని సూచించారు. అభ్యంతరాలుంటే 30 రోజులు సమయమిచ్చి కలెక్టరేట్‌కు రమ్మని చెప్పిన ప్రభుత్వం… మిగతా జిల్లాలకు సమయం ఇవ్వకుండా కోనసీమకే ఎందుకు సమయమిచ్చిందని ప్రశ్నించారు.
సామూహికంగా కాదు.. వ్యక్తులుగా రావాలని చెప్పారని.. అది వ్యక్తులను టార్గెట్ చేయడమేనని జనసేన భావిస్తోందన్నారు. గొడవలు జరగాలనే అభ్యంతరాలకు సమయం ఇచ్చారా? అని పవన్ ప్రశ్నించారు. తాజాగా జరిగిన కోనసీమ ఘటనకు జనసేన బాధ్యత వహించాలని.. మంత్రి తానేటి వనిత పేర్కొనడం.. చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. మంత్రి స్థానంలో ఉన్న వనిత నోటికి ఏదొస్తే.. అది మాట్లాడడం సమంజసంగా లేదన్నారు.
మహిళలపై అత్యాచారాలు జరిగినప్పుడు ఎలాంటి బాధ్యత లేకుండా.. తల్లులదే బాధ్యతని చెప్పిన వనితకు ఇంత కన్నా సంస్కారం ఏముంటుందని పవన్ నిలదీశారు. జనసేన ఎప్పుడూ.. సామాజిక శాంతిని.. కోరుకుంటుందన్నారు. ప్రస్తుతం కోనసీమ ప్రజలు శాంతియుతంగా ఉండాలని.. తమ డిమాండ్లను శాంతియుతంగా తెలపాలని.. వారి అభిప్రాయాలను ప్రభుత్వం కూడా పరిగణనలోకి తీసుకోవాలని.. పవన్ డిమాండ్ చేశారు.