జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మరోసారి రెస్ట్ మోడ్‌లోకి వెళ్లారు. ఆయనకు మరోసారి జ్వరం వచ్చినట్టు జనసేన వర్గాలు తెలిపాయి. అందుకే ఆయన రెండు రోజుల పాటు రెస్టు తీసుకోనున్నట్టు పార్టీ ప్రకటిం చింది. వాస్తవానికి నాలుగు రోజుల రెస్టు తర్వాత.. ఆదివారమే పవన్ ప్రజల ముందుకు వచ్చారు. అనకాప ల్లిలో నిర్వహించిన వారాహి విజయభేరి యాత్రలో పాల్గొన్నారు. అయితే.. ఈ సభలోనూ ఆయన నీరసంగానే కనిపించారు. పెద్దగా సినిమా డైలాగులు కూడా పేల్చలేక పోయారు.
పవన్ రాత్రే సొమ్మసిల్లి పడిపోయారని వార్తలు హల్చల్ చేశాయి. ఇక, ఇప్పుడు ఆయన రెండు రోజులు విశ్రాంతి తీసుకుంటారని పార్టీ తెలిపింది. దీంతో సోమవారం, మంగళవారం చేయాల్సిన పర్యటనలు రద్దయ్యాయి. సోమవారం.. పవన్ ఉమ్మడి విశాఖపట్నంలోని ఎలమంచిలి నియోజకవర్గంలో పర్యటించా ల్సి ఉంది. రోడ్ షో కూడా చేయాల్సి ఉంది. దీనికి ఏర్పాట్లు కూడా చేశారు.కానీ, దీనిని రద్దు చేశారు. ఇక, మంగళవారం ఉగాదిని పురస్కరించుకుని పిఠాపురంలో అద్దెకు తీసుకున్న ఇంట్లో కార్యక్రమాలు చేపట్టారు.
అయితే.. ఈ కార్యక్రమాలకైనా పవన్ హాజరువతారా? లేదా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కీలక మైన ఎన్నికల సమయం కావడం.. అందునా ఉమ్మడిగా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉన్న తరుణంలో ఇలా పవన్ అనారోగ్యం బారిన పడడం పార్టీ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. తరచుగా జ్వరం బారిన పడుతుండడానికి కారణాలేంటనేది కూడా ఆసక్తిగా మారింది. డీహైడ్రేషన్ కావడం.. ఎండ వేడిమి తట్టుకునే పరిస్థితి లేకపోవడం.. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు.. వంటివి పవన్ పై ప్రభావం చూపిస్తున్నాయనే చర్చ జరుగుతోంది.