టీడీపీ-జనసేన అభ్యర్థుల తొలి విడత ఉమ్మడి జాబితాను ప్రకటించిన తర్వాత ఇరు పార్టీల అధినేతలు కలిసి తొలిసారిగా ‘జెండా’ బహిరంగ సభలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈరోజు తాడేపల్లిగూడెంలో జరిగిన ‘జెండా’ బహిరంగ సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు ఆ సభకు జెండా పేరు ఎందుకు పెట్టారో అన్న విషయాన్ని స్వయంగా చెప్పారు. టీడీపీ జెండాను పవన్ కల్యాణ్, జనసేన జెండాను చంద్రబాబు పట్టుకొని రెపరెపలాడించి రాష్ట్రంలోని టీడీపీ, జనసేన నేతలకు, కార్యకర్తలకు ఒకరి జెండా మరొకరు మోసి కూటమిని గెలిపించాల్సిన ఆవశ్యకతను వివరించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలు తమతో చేయి కలిపి ముందుకు రావాలని, ఈ కూటమికి మద్దతునివ్వాలని ఆయన పిలుపునిచ్చారు. టీడీపీ-జనసేన కలిసిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికల ప్రచార సభ ఇదని, టీడీపీ-జనసేన పొత్తు సూపర్ హిట్ అవుతుందని అన్నారు. జగన్ కుట్రలు, కుతంత్రాలు అట్టర్ ఫ్లాప్ అని, విధ్వంసాలకు ఫుల్ స్టాప్ పెడతామని చెప్పారు. టీడీపీ-జనసేన కూటమి ఒక విన్నింగ్ టీమ్… వైసీపీ ఒక ఛీటింగ్ టీమ్ అని సెటైర్లు వేశారు. అగ్నికి వాయువు తోడైనట్టు పవన్ కల్యాణ్ మనతో చేయి కలిపారని,అగ్నికి వాయువు తోడైతే వైసీపీ బుగ్గి అయిపోతుందని జోస్యం చెప్పారు.
ఏపీ దశ దిశ మార్చబోయే సభ ఇదని చంద్రబాబు అన్నారు. అహంకారంతో రాష్ట్రంలో విధ్వంసం సృష్టించిన నేతలను తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు చెప్పారు. తాడేపల్లిగూడెం సభ చూసి తాడేపల్లి ప్యాలెస్ కంపించిపోతోందని ఈ సభకు వచ్చిన అనూహ్యమైన స్పందన టీడీపీ-జనసేన కూటమి విజయానికి శుభ సూచకం వంటిదని చంద్రబాబు చెప్పారు. నవ్యాంధ్రప్రదేశ్ కు త్వరలోనే నవోదయం రాబోతుందని, రాబోయే ఎన్నికలు అత్యంత కీలకమని చంద్రబాబు అన్నారు.
టీడీపీ, జనసేన చేతులు కలిపింది తన అధికారం కోసమో, పవన్ కళ్యాణ్ అధికారం కోసమో కాదని, 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం అని చంద్రబాబు చెప్పారు. హత్యకు గురైన ప్రజాస్వామ్యాన్ని బతికించేందుకే చేతులు కలిపామని అన్నారు. ఒక వ్యక్తి అహంకారం వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఒక సీనియర్ రాజకీయ వేత్తగా తాను చూస్తూ ఉండలేనని, ప్రశ్నించే, ఎదిరించే తత్వం ఉన్న పవన్ కళ్యాణ్ కూడా మౌనంగా చూస్తూ ఊరుకోరని అన్నారు. అందుకే, టీడీపీ-జనసేనల పొత్తు ప్రజలు కుదిర్చిన పొత్తు అని, జనం కోరుకున్న పొత్తు అని చంద్రబాబు చెప్పారు. జగన్ పాలనలో చీకట్లు నిండిపోయిన రాష్ట్రంలో వెలుగులు నింపేది ఈ పొత్తు అని, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఏర్పడిన ఈ కూటమితో కలిసి అడుగులు వేయాలని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.